Gautam Gambhir : వెస్టిండీస్ పై భారత్ రికార్డు ఛేదన.. గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తి..
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డేకు ఉపయోగించిన పిచ్‌పై గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
- Thota Vamshi Kumar
- Updated on- October 1, 2026 / 03:32 PM IST
Gautam Gambhir Unhappy Even As India Beat West Indies In 800-Run 2nd ODI
Gautam Gambhir : గౌహతి వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. 406 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ద్విశతకం, రోహిత్ శర్మ శతకం బాదడంతో భారత్ అలవోకగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో భారత జట్టు పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే.. టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ఈ మ్యాచ్ కోసం ఉపయోగించిన పిచ్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
మ్యాచ్ అనంతరం బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ.. గౌహతిలో అభిమానులు చూసింది క్రికెట్ కాదని గంభీర్ అన్నారు. నిజాయితీగా చెప్పాలంటే.. బ్యాట్, బంతికి మధ్య ఇంకాస్త పోటీ ఉండాలన్నాడు. అందరూ క్రికెట్ గురించి మాట్లాడుతున్నారు.. కానీ ఇది క్రికెట్ కాదు, ఇది కేవలం బ్యాటింగ్ మాత్రమే అని గంభీర్ చెప్పాడు.
ప్రత్యర్థి జట్టు 400+ పరుగులు చేయడం, ఆ తర్వాత మనం ఆ భారీ లక్ష్యాన్ని ఛేదించడం రికార్డుల పరంగా ప్రేక్షకుల పరంగా, బ్రాడ్ కాస్టర్ల పరంగా అద్భుతంగా అనిపించవచ్చు. అయితే.. ఓ నిజమైన క్రికెట్ అభిమానిగా, కోచ్‌గా అసంతృప్తిగా ఉంది. బౌలర్లకు అవకాశం ఉండాలని అనుకుంటాను. ఇదే పిచ్ పై ఓ కుర్రాడు బౌలింగ్ చేస్తే అతడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని సూచించాడు. బ్యాటర్లకే కాకుండా బౌలర్లకు అనుకూలంగా ఉండే విధంగా పిచ్‌లను తయారు చేయాలి. అని గంభీర్ తెలిపాడు.
వన్డే ప్రపంచకప్‌పై..
2027 వన్డే ప్రపంచకప్‌కు ఏడాది మాత్రమే సమయం ఉందని, ఇందులో మూడు నెలలకు ఐపీఎల్‌కు వెళ్లిపోతుందన్నాడు. మరో మూడు నెలలు భారత్, ఆస్ట్రేలియా సిరీస్ జరుగుతుందన్నాడు. ఇక మిగిలిన సమయంలో ఓ 20 వన్డేలను మాత్రమే జట్టు ఆడనుందని, అందుకనే వీటిల్లో బ్యాటర్లు, బౌలర్లను పరీక్షించి ఓ అద్భుతమైన జట్టును రూపొందిచాల్సిన అవసరం ఉందన్నాడు.
ఐపీఎల్ తరువాతనే మెయిన్ ప్రాబబుల్స్‌తో ఎక్కువగా ఆడిస్తామన్నాడు. అప్పటి వరకు వివిధ రకాల కాంబినేషన్లను ప్రయత్నిస్తూనే ఉంటామన్నాడు. ఈ సారి అకిబ్‌కు అవకాశం లభించినట్లే ఆ తరువాత ఇతర ఆటగాళ్లకు రావొచ్చు అని గంభీర్ చెప్పాడు.
