అనుచిత వ్యాఖ్యలు చేసి భారత జట్టు నుంచి నిషేదానికి గురైన హర్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీకి వివరణ ఇచ్చారు. ఆసియా కప్ జరుగుతుండగా గాయానికి లోనై మ్యాచ్ నుంచి తప్పుకున్న పాండ్యా.. కొంతకాలం విరామం తీసుకుని మళ్లీ జట్టులోకి పునరాగమనం చేయనున్న తరుణంలో పెద్ద షాక్‌కు గురైయ్యాడు. జట్టు నుంచి సస్పెన్స్ ఎదుర్కోవాల్సిన దుస్ధితి ఏర్పడింది. సెలబ్రిటీల ఇంటర్వ్యూలతో సరదాగా సాగిపోతున్న టీవీ కార్యక్రమం ‘కాఫీ విత్ కరణ్’కు అతిథులుగా హాజరైన పాండ్యా, రాహుల్‌లు మనసు విప్పి మాట్లాడటమే కాకుండా యథేచ్చగా భావాలు పంచేసుకున్నారు.
వాటిలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు కూడా ఉండటంతో బీసీసీఐ వారిని సస్పెన్షన్‌కు గురి చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీకి వివరణ ఇచ్చుకున్నారు. ఆ నివేదికను కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు ఒక రోజు వ్యవధిలో జోహ్రీ సమర్పించనున్నారు. ఈ ప్ర్రక్రియలో కరణ్ ఏజెంట్లు ఏమైనా ఒత్తిడి తెచ్చారా అనే ప్రశ్నలు కూడా జోహ్రీ అడగలేదట. కేవలం వారిద్దరి వివరణ మాత్రమే విన్నారట. జోహ్రీ ఈ వివాదాన్ని పొడిగించడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది.
సదరు విషయానికి ముందుగా స్పందించిన రాహుల్ జోహ్రీ వారిపై రెండు మ్యాచ్‌ల నిషేదాన్ని విధిస్తూ ఆజ్ఞలు జారీ చేయగా.. అతని సహచరురాలు అయిన డయానా ఎడుల్జీ మాత్రం దానిని తీవ్రంగా పరిగణిస్తూ బీసీసీఐ లీగల్ సెల్‌కు ఫార్వార్డ్ చేశారు. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లుగా పేర్కొంటూ తగు చర్యలు తీసుకోవాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఇప్పటికే పలుమార్లు సీఓఏ సభ్యుల మధ్య పొరపచ్చాలు తలెత్తుండటంతో ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో మరి..!