మహిళల టీ20 చాలెంజ్ తొలి సీజన్ విజేతగా సూపర్ నోవాస్ నిలిచింది. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో వెలాసిటీపై విజయం సాధించింది. లీగ్ మ్యాచ్ లో మిథాలీ జట్టును ఓడించి ఫైనల్ కు అర్హత సాధించిన సూపర్ నోవాస్ మరోసారి వెలాసిటీపై పైచేయి సాధించింది. ఒకానొక దశలో గెలుపు కష్టమనకుంటున్న తరుణంలో తనదైన శైలిలో మెరుపులు మెరిపించిన హర్మన్‌ప్రీత్ కౌర్ (51; 37 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సులు) సూపర్ నోవాస్‌ను విజయపథంలో నడిపించింది.
శనివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో నోవాస్ 4 వికెట్ల తేడాతో మిథాలీరాజ్ సారథ్యంలోని వెలాసిటీని ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెలాసిటీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులే చేసింది. సుష్మా వర్మ (32 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), అమెలియా కెర్ (36; 4 ఫోర్లు) రాణించారు.
అనంతరం లక్ష్య ఛేదనలో హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఆలమ్, కెర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. రెండో ఓవర్‌లో జయంగని (2) రనౌటైంది. రోడ్రిగ్స్ (22; 3 ఫోర్లు)తో కలిసి మరో ఓపెనర్ పునియా (31 బంతుల్లో 29; 5 ఫోర్లు) చెలరేగిపోయింది. వీరిద్దరూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. విజయానికి 36 బంతు ల్లో 58 పరుగులు అవసరమైన దశలో.. 4 పరుగులతో క్రీజులో ఉన్న కెప్టెన్ కౌర్ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగింది.