Hong Kong Sixes 2025 India won by 2 runs DLS Method against Pakistan
Hong Kong Sixes 2025 : హాంకాంగ్ సిక్సర్ 2025 టోర్నీలో భాగంగా శుక్రవారం మోంగ్ కోక్ లోని మిషన్ రోడ్ గ్రౌండ్ లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 2 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.
ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 6 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రాబిన్ ఉతప్ప (28; 11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), భరత్ చిప్లి (24; 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), దినేశ్ కార్తిక్ (17 నాటౌట్; 6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపించారు.
స్టువర్ట్ బిన్ని (4), అభిమన్యు మిథున్ (6) లు విఫలం అయ్యారు. పాక్ బౌలర్లలో ముహమ్మద్ షెహజాద్ రెండు వికెట్లు తీశాడు. అబ్దుల్ సమద్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఆ తరువాత 87 పరుగుల లక్ష్యంతో పాక్ బరిలోకి దిగింది. మూడు ఓవర్లు పూర్తి అయ్యే సరికి పాక్ వికెట్ నష్టపోయి 41 పరుగులు చేసింది. ఖ్వాజా నఫే (18 నాటౌట్), అబ్దుల్ సమద్ (16 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఈ దశలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తగ్గకపోవడం, మ్యాచ్‌ను కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 2 పరుగుల తేడాతో భారత్‌ను విజేతగా ప్రకటించారు.