Gujarat Titans-IPL
Gujarat Titans-IPL: ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ఆడడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని ఐర్లాండ్ క్రికెటర్ జోషువా లిటిల్ అన్నాడు. జోషువాను గుజరాత్ టైటాన్స్ రూ.4.4 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. జోషువా 2016 నుంచి అంతర్జాతీయ క్రికెట్లో ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఐర్లాండ్ తరఫున 22 వన్డేలు, 53 టీ20లు ఆడాడు.
తాజాగా అతడు మీడియాతో మాట్లాడుతూ… డిఫెండింగ్ ఛాంపియన్స్ జట్టులో ఆడడానికి సంకతం చేశానని, ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా, ఆశిష్ నెహ్రా కోచ్ గా ఉన్న గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు.
‘‘ఐర్లాండ్ క్రికెట్ జట్టు తరఫు ఆడడం అంటే చాలా ఇష్టం. దానికే నేను ప్రాధాన్యం ఇస్తాను. అయితే, మరింత నేర్చుకోవడానికి, ఆడడానికి ఐపీఎల్ లో అవకాశం దక్కడం అసాధారణ విషయం. ఇందుకు మద్దతు తెలిపినందుకు ఐర్లాండ్ క్రికెట్ కు కృతజ్ఞతలు చెబుతున్నాను’’ అని జోషువా లిటిల్ చెప్పాడు. కాగా, నిన్న జరిగిన ఐపీఎల్ వేలంలో పలు దేశాల క్రికెటర్లను కొన్ని జట్లు అత్యధిక ధరకు దక్కించుకున్నాయి.