×
Ad

భారత్ తో మ్యాచ్ బాయ్ కాట్ చేసినా ICC మమ్మల్ని ఏమీ చేయలేదు.. పాక్ పిచ్చి లాజిక్..

దురదృష్టవశాత్తు, సమస్యను పరిష్కరించే బదులు, ఐసీసీ కేవలం ప్రేక్షక పాత్ర పోషించిందనే వాస్తవాన్ని నేను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నా.

  • Published On : February 2, 2026 / 06:32 PM IST

Ehsan Mani Representative Image (Image Credit To Original Source)

 

  • పాక్ క్రికెట్ బోర్డుపై ఐసీసీ ఆంక్షలు విధించలేదు
  • ఐసీసీకి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు
  • ఐసీసీ కేవలం ప్రేక్షకపాత్ర పోషించింది

Ehsan Mani: టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుని ఐసీసీ శిక్షించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడీ వ్యవహారం టాపిక్ గా మారింది. ఈ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ చీఫ్ ఎహసాన్ మణి స్పందించారు. గతంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఛైర్మన్‌గా కూడా పనిచేసిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తో మ్యాచ్ ను బాయ్ కాట్ చేసినా.. పాకిస్తాన్ క్రికెట్ జట్టును ప్రపంచ క్రికెట్ సంస్థ శిక్షించలేదని తెలిపారు. ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే T20 ప్రపంచ కప్ 2026 గ్రూప్ A మ్యాచ్‌లో పాకిస్తాన్ భారత్‌తో తలపడాల్సి ఉంది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకారం, మెన్ ఇన్ గ్రీన్ జట్టు ఇండియాతో మ్యాచ్‌ను బహిష్కరించినట్లు ప్రకటించింది.

నాడు పాకిస్తాన్ తో ఆడేందుకు భారత్ నిరాకరించింది..

”తమ దేశ ప్రభుత్వ సూచనలను పాటించినందుకు పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డును ఐసీసీ శిక్షించలేదు. పాకిస్తాన్ ప్రభుత్వ సూచనలను పాటిస్తే దానిపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు. పాకిస్తాన్‌లో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను ఆడటానికి భారత్ నిరాకరించడానికి కూడా కారణం అదే. ఐసీసీకి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు. దురదృష్టవశాత్తు, సమస్యను పరిష్కరించే బదులు, ఐసీసీ కేవలం ప్రేక్షక పాత్ర పోషించిందనే వాస్తవాన్ని నేను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాను” అని మణి అన్నారు.

“ఏ దేశమైనా దాని ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి మీరు తలుపులు తెరిచి ఉంచారు. ముఖ్యంగా PCB ఛైర్మన్ ప్రభుత్వానికి సేవలందిస్తున్న మంత్రి అని గుర్తించాలి” అని మణి చెప్పారు.

ఐసీసీ హెచ్చరికను పట్టించుకోని పీసీబీ..

భారత్ తో మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. పైనుంచి వచ్చే సూచనలను పాటించడం తప్ప మాకు మరో మార్గం లేదని పీసీబీ క్రికెట్ బోర్డు అధికారి స్పష్టం చేశారు. 2026 టీ20 ప్రపంచ కప్ నాకౌట్ దశలో భారత్‌తో మరో మ్యాచ్ జరిగే అవకాశం ఉంటే ప్రభుత్వ సూచనలను పీసీబీ పాటిస్తుందని తేల్చి చెప్పారు.

“ఫిబ్రవరి 15న భారత్‌తో పాక్ క్రికెట్ జట్టు ఆడదు. దీంతో పాక్ జట్టు ప్రపంచ కప్‌లో పాయింట్లను కోల్పోతుందని ప్రభుత్వం బోర్డుకు తెలిపింది. అంతేకాదు నాకౌట్ దశల్లో పాకిస్తాన్ భారత్‌తో ఆడాల్సి వస్తే, ఆ సమయంలో కూడా ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్ని అయినా బోర్డు అనుసరిస్తుంది” అని పాక్ క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి. భారత్‌తో ఆడకూడదనే తమ ప్రభుత్వ నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)కి పీసీబీ సోమవారం తెలుపనుందని సమాచారం.

Also Read: భార‌త్‌తో మ్యాచ్ బ‌హిష్క‌రిస్తే.. ‘పాక్ పై చర్యలు ఊహాతీతం’.. ICC మాస్టర్ ప్లాన్