IND vs AFG 3rd T20 : అఫ్గాన్‌తో మూడో టీ20 మ్యాచ్.. అభిషేక్ శర్మ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్..
IND vs AFG 3rd T20 : ఇండియా వర్సెస్ అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్ అభిషేక్ శర్మ అదరగొట్టాడు. 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.
- Harish Thanniru
- Updated on- September 17, 2026 / 08:33 PM IST
Abhishek Sharma
IND vs AFG 3rd T20 : ఇండియా వర్సెస్ అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం రాత్రి న్యూఢిల్లీ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చి పరుగుల వరద పారించారు. అభిషేక్ శర్మ ఆరంభం నుంచి సిక్సులు, ఫోర్లతో అఫ్గాన్ బౌలర్లను ఊచకోతకోశాడు. ఈ క్రమంలో కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో పది సిక్సులు, తొమ్మిది ఫోర్లు ఉన్నాయి.
Also Read : Happy Journey Review : ‘హ్యాపీ జర్నీ’ రివ్యూ.. ఏడుగురు ఆడవాళ్లు ఫ్రాన్స్ ట్రిప్ కి వెళ్తే ఏం జరిగింది?
సెంచరీ పూర్తిచేసిన కొద్దిసేపటికే అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రహ్మానుల్లాహ్ గుర్బాజ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. దీంతో అభిషేక్ 34 బంతుల్లో 108 పరుగులు చేయగా.. అందులో 11 సిక్సులు.. తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. అయితే, టెస్ట్ క్రికెట్ ఆడే దేశాల్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అభిషేక్.. ఆతర్వాత 50 పరుగులు పూర్తి చేసేందుకు మరో 14 బంతులు మాత్రమే తీసుకున్నాడు. అభిషేక్ ఆ బౌలర్ ఈ బౌలర్ అన్న తేడా లేకుండా ఆఫ్ఘన్ బౌలింగ్ మొత్తాన్ని ఊచకోత కోశాడు.
టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ 2017లో శ్రీలంకపై 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తాజాగా ఈ రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా చూస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇది మూడో వేగవంతమైన సెంచరీ.
