IND vs ENG : టాస్ ఓడిన భారత్.. టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ (IND vs ENG) ప్రారంభమైంది.
- Thota Vamshi Kumar
- Updated on- July 14, 2026 / 03:38 PM IST
IND vs ENG 1st ODI England opt to bat
IND vs ENG : మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ తొలుత బౌలింగ్ చేయనుంది. టీ20 సిరీస్‌లో ఘోర పరాజయం పాలైన భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి వన్డే సిరీస్‌లో శుభారంభం చేయాలని భావిస్తోంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లు రావడంతో టీమ్ఇండియా బలం పెరిగింది.
‘టాస్ ఓడిపోయినందుకు బాధగా లేదు. నిజం చెప్పాలంటే మేము ముందుగా బౌలింగ్ చేయాలనే అనుకున్నాము. టీ20 జట్టులోని పలువురు ఆటగాళ్లు వన్డే జట్టులోనూ ఉన్నారు. మిగిలిన వారికి విశ్రాంతి దొరికింది. వన్డే జట్టులోని పలువురు ఆటగాళ్లము రెండు రోజుల ముందే ఇక్కడికి వచ్చాము. మ్యాచ్‌కు మంచిగా సన్నద్ధం అయ్యాం. జట్టులో వాతావరణం బాగుంది. వన్డే ప్రపంచకప్ 2027ను దృష్టిలో పెట్టుకుని జట్టును నిర్మించే పనిలో ఉన్నాము. ఈ క్రమంలో ఇది మాకు ఎంతో ముఖ్యమైన సిరీస్. భారతదేశంలో ఉండే పరిస్థితులతో పోలిస్తే.. ఇక్కడ ఉండే పరిస్థితులు దక్షిణాఫ్రికాకు కొంత దగ్గరగా ఉంటాయి. కుర్రాళ్లు ఈ సిరీస్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. సీనియర్లు విరాట్, రోహిత్, కేఎల్ రాహుల్, బుమ్రా తిరిగి జట్టులో చేరారు. వారి అనుభవం మాకు ఎంతో కీలకం. ఇక తుది జట్టు విషయానికి వస్తే.. శివమ్ దూబెతో కలిపి నలుగురు సీమర్లతో బరిలోకి దిగుతున్నాం. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లు స్పిన్ బాధ్యతలు మోయనున్నారు.’ అని శుభ్‌మన్ గిల్ అన్నాడు.
ఇంగ్లాండ్ తుది జట్టు..
జాకబ్ బెథెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్
భారత తుది జట్టు..
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ
