IND vs SA : శతక్కొట్టిన కోహ్లీ, దంచికొట్టిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. తొలి వన్డేలో సౌతాఫ్రికా ఎదుట భారీ లక్ష్యం..
రాంచి వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో (IND vs SA ) టీమ్ఇండియా భారీ స్కోరు సాధించింది.
- Thota Vamshi Kumar
- Published On : November 30, 2025 / 05:30 PM IST
IND vs SA 1st ODI Team India score 349 with 8 wickets loss south africa target is 350
IND vs SA : రాంచి వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా భారీ స్కోరు సాధించింది. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ (135; 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు సాధించింది. టీమ్ఇండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ (57; 51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ కేఎల్ రాహుల్ (60; 56 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) లు హాఫ్ సెంచరీలు బాదారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఓట్నీల్ బార్ట్‌మన్, నాండ్రే బర్గర్, మార్కోజాన్సెన్ , కార్బిన్ బాష్ లు తలా రెండు వికెట్లు తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది. రెండు ఫోర్లు ఓ సిక్స్ బాది మంచి ఊపులో కనిపించిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ (18; 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) జట్టు స్కోరు 25 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. అతడిని నాండ్రే బర్గర్ ఔట్ చేశాడు.
ఈ దశలో మరో ఓపెనర్ రోహిత్ శర్మతో జత కలిసిన విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఈ సీనియర్ ద్వయం దక్షిణాప్రికా బౌలర్ల పై ఎదురుదాడికి దిగారు. ముందుగా కోహ్లీ, ఆ తరువాత రోహిత్ శర్మలు అర్థశతకాలను పూర్తి చేసుకున్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తరువాత ఓ భారీ షాట్‌కు యత్నించి రోహిత్ శర్మ మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. కోహ్లీ, రోహిత్ జోడీ రెండో వికెట్ కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వన్డేల్లో సిక్సర్ల కింగ్ హిట్‌మ్యానే..
రుతురాజ్ గైక్వాడ్ (8), వాషింగ్టన్ సుందర్ (13)లు విఫలమైనా మరో ఎండ్‌లో కోహ్లీ ధాటిగా ఆడాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 102 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 52వ సెంచరీ కావడం విశేషం. సెంచరీ అనంతరం కోహ్లీ చాలా వేగంగా ఆడాడు. ఓ భారీ షాట్ కు యత్నించి నాండ్రే బర్గర్ బౌలింగ్‌లో రికెల్టన్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు.
ఆ తరువాత కెప్టెన్ కేఎల్ రాహుల్, జడేజా (32; 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడారు. తనదైన శైలిలో షాట్లు ఆడుతూ రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఏడు బంతుల్లో ఇన్నింగ్స్ ముగుస్తుందనగా రాహుల్, ఆఖరి ఓవర్‌లో జడేజా ఔట్ అయ్యారు.
