IND-W vs ZIM-W : హర్మన్‌ప్రీత్ కౌర్, షఫాలీ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్.. భారత్ భారీ స్కోరు

India Women vs Zimbabwe Women 3rd T20 : ఇండియా మహిళల జట్లు వర్సెస్ జింబాబ్వే మహిళల జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోర్ చేసింది.

India Women vs Zimbabwe Women 3rd T20

India Women vs Zimbabwe Women 3rd T20 : ఇండియా మహిళల జట్టు వర్సెస్ జింబాబ్వే మహిళల జట్టు మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం రాత్రి మూడో టీ20 మ్యాచ్ రాయ్‌పూర్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు జింబాబ్వేకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Also Read: Asian Para Games 2026 : ఆసియా పారా గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నిషాద్ కుమార్.. రెండో స్వర్ణం కైవసం..

భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా మాజీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తన విశ్వరూపం చూపించింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఆమె.. ప్రత్యర్థి బౌలర్లపై మొదటి నుంచి విరుచుకుపడింది. ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన షఫాలీ వర్మ మెరుపు ఇన్నింగ్స్ తో ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.

టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో 41బంతుల్లో 91 పరుగులు (నాటౌట్) చేసింది. ఇందులో పది ఫోర్లు, ఐదు సిక్సులు ఉన్నాయి. ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన షెఫాలీ వర్మ సుడిగాలి ఇన్నింగ్స్‌తో 37బంతుల్లో 69 పరుగులు చేసింది. ఇందులో ఆరు ఫోర్లు, ఐదు సిక్సులు ఉన్నాయి. వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో భారత్ జట్టు భారీ స్కోర్ చేసింది.

మిగిలిన బ్యాటర్లు అనుష్క శర్మ 28 పరుగులతో పర్వాలేదనిపించగా.. రిచా ఘోష్ 1, నిక్కీ ప్రసాద్ 9, అరుంధతీరెడ్డి నాలుగు, ప్రేమ రావత్ 4 రన్స్ చేశారు. దీప్తి శర్మ డకౌట్ అయ్యి విఫలమయ్యారు. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ స్మృతి మంధాన బ్యాటింగ్‌కు రాకపోవడం గమనార్హం. జింబాబ్వే బౌలర్లలో బిజా మూడు వికెట్లు, నోమ్‌వెలో సిబంద, న్యాషా, టెండాయ్ మకుషా తలో వికెట్ తీశారు.

కెప్టెన్ స్మృతి మంధాన నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. దీంతో చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.