174 స్వర్ణాలు దక్కించుకున్న భారత్

భారత క్రీడాకారుల ప్రతిభ ప్రపంచ నలుమూలలా విస్తరిస్తుంది. మంగళవారం డిసెంబరు 10న ముగిసిన 13వ దక్షిణ ఆసియా క్రీడల్లో భారత్‌ చరిత్ర సృష్టించింది. ఛాంపియన్‌షిప్ ఆరంభం నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 312 (174 స్వర్ణ, 93 రజత, 45 కాంస్యాలు) పతకాలు గెలిచి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. 1984లో టోర్నీ మొదలుపెట్టినప్పటి నుంచి భారత్ దే పైచేయిగా కొనసాగుతుంది. 

ఈ టోర్నమెంట్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 2016లో గువాహటితో జరిగిన పోటీల్లో మన బృందం 309 పతకాలతో (189 స్వర్ణ, 90 రజత, 30 కాంస్యాలు) నెలకొల్పిన రికార్డును చేధించాం. పదిహేను స్వర్ణాలు తగ్గాయి. ప్రస్తుత పోటీల్లో ఆతిథ్య నేపాల్‌‌కు 206 పతకాలతో రెండో స్థానం దక్కింది. 

పోటీల చివరి రోజైన మంగళవారం భారత్‌ 18 (15 స్వర్ణ, 2 రజత, 1 కాంస్యం) పతకాలు ఖాతాలో వేసుకుంది. బాక్సింగ్‌లో మరో ఆరు స్వర్ణాలు సొంతమయ్యాయి. వికాస్‌ కృష్ణన్‌ (69 కేజీల విభాగం), పింకీరాణి (51 కేజీల విభాగం), స్పర్శ్‌ కుమార్‌ (52 కేజీల విభాగం), నరేందర్‌ (91 కేజీల పైన), సోనియా (57 కేజీల విభాగం), మంజు (64 కేజీల విభాగం) ఫైనల్లో గెలిచి స్వర్ణాలు సాధించారు. 

బాక్సింగ్‌లో మొత్తం భారత్‌ 12 పసిడి పతకాలు గెలిచింది. స్క్వాష్‌, బాస్కెట్‌బాల్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో భారత్‌ స్వర్ణాలు సాధించింది.