U19 Asia Cup 2026 Final : సెహ్వాగ్ వారసుడి జోరు.. లక్ష్య్ మెరుపులు.. అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత్!
U19 Asia Cup 2026 Final : అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్‌కు భారత్ దూసుకెళ్లింది. సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్‌పై 8 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఫైనల్లో పాకిస్థాన్‌తో తలపడనున్న టీమిండియా టైటిల్ సాధిస్తుందా? లేదో చూడాలి..
- Sreehari A
- Published on- November 12, 2026 / 07:16 PM IST
India Storm Into U19 Asia Cup 2026 Final
- తృటిలో సెంచరీ మిస్.. ఆర్యవీర్ హాఫ్ సెంచరీ..
- అఫ్గాన్‌పై అదిరిపోయే విజయం..
- ఫైనల్లో పాకిస్థాన్‌తో భారత్ అమీతుమీ
- ఆసియా కప్ టైటిల్‌పై కన్నేసిన భారత యువ జట్టు
U19 Asia Cup 2026 Final : అండర్-19 ఆసియా కప్‌లో టీమిండియా కుర్రాళ్లు అదరగొడుతున్నారు. టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచారు. సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసిన భారత యువ జట్టు.. ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇక శనివారం (14-11-2026) జరిగే తుది పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఫైనల్ మ్యాచ్‌పై ఆసక్తి పెరిగిపోయింది..
గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అఫ్గానిస్థాన్ నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.5 ఓవర్లలోనే 2 వికెట్లు (U19 Asia Cup 2026 Final) కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది.
Read Also : WhatsApp Chats : బాబోయ్.. వాట్సాప్‌లో మన చాట్స్ నిజంగా సీక్రెట్టేనా? Google AI చెప్పిన షాకింగ్ నిజాలు!
ఆర్యవీర్ సెహ్వాగ్ హాఫ్ సెంచరీ :
కెప్టెన్ లక్ష్య్ రాజేష్ రాయచందాని అద్భుతంగా ఆడాడు. 90 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్స్‌తో 93 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మరోవైపు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తన ఫామ్‌ను కొనసాగించాడు. 57 బంతుల్లో 51 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీకే వినీత్ కూడా 62 బంతుల్లో 57 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
అఫ్గానిస్థాన్ 227 పరుగులు :
అంతకుముందు బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 227 పరుగులు చేసింది. నోమన్ సలార్జాయ్, షా ఫైజల్ రహిమీ చెరో 51 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో ఇషాన్ సూద్ మూడు వికెట్లతో సత్తా చాటాడు.
మరో సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించిన పాకిస్థాన్ ఫైనల్‌కు చేరింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. లీగ్ దశలో భారత్‌కు పాక్ చేతిలో ఓటమి ఎదురైంది. ఇప్పుడు ఫైనల్లో ఆ ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం వచ్చింది. మరి ఈసారి భారత కుర్రాళ్లు పాక్‌ను ఓడించి ఆసియా కప్‌ను ముద్దాడతారా? లేదో చూడాలి..
