India vs Sri Lanka : శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. ఫైనల్లో పాక్‌తో హై ఓల్టేజ్ ఫైట్! మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?

Asian Games 2026 : ఏషియన్ గేమ్స్ 2026లో క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్–పాకిస్థాన్ పోరుకు రంగం సిద్ధమైంది. గోల్డ్ మెడల్ కోసం దాయాదుల జట్లు తలపడనుండటంతో ఈ హైఓల్టేజ్ ఫైనల్‌పై అందరి దృష్టి నెలకొంది.

India vs Sri Lanka

India vs Sri Lanka : ఏషియన్ గేమ్స్‌- 2026 పురుషుల టీ20 క్రికెట్‌లో భారత జట్టు జోరు కొనసాగిస్తోంది. గురువారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీలంక జట్టును ఏకంగా 124 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఇప్పటికే ఫైనల్లోకి అడుగు పెట్టిన పాకిస్థాన్ జట్టుతో ఈనెల 3వ తేదీన టీమిండియా తలపడనుంది.

Also Read : India vs Sri Lanka : ఇషాన్ కిషన్ విధ్వంసకర ఇన్నింగ్స్.. శ్రీలంక బౌలర్లను ఆడుకున్న వైభవ్

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు.. ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్‌ (46బంతుల్లో 80) తో నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత బౌలర్లు శ్రీలంక బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. కేవలం 9.5 ఓవర్లలోనే 45 పరుగులకే శ్రీలంక ఆలౌట్ కావడంతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ఏషియన్ గేమ్స్‌లో పురుషుల క్రికెట్ విభాగంలో భారత జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది.

మరోవైపు.. సెమీస్‌లో బంగ్లాదేశ్‌ జట్టుపై విజయం సాధించిన పాకిస్థాన్‌ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. అయితే, బంగ్లాదేశ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయగా.. 13 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ జట్టు 11.3 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 112 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో ఫైనల్లోకి అడుగు పెట్టింది. భారత్ , పాకిస్థాన్ జట్టు పైనల్లో స్వర్ణ పతకం కోసం పోటీ పడనున్నాయి. ఇదిలాఉంటే.. భారత్ గత ఏషియన్ గేమ్స్‌లో పురుషుల క్రికెట్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఇప్పుడు మరోసారి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది.

ఫైనల్ ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు..
భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య గోల్డ్ మెడల్ (ఫైనల్) మ్యాచ్ అక్టోబర్ 3న (శనివారం) జరగనుంది. జపాన్‌లోని నిషిన్‌లో ఉన్న కొరోగి స్పోర్ట్స్ పార్క్ ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు వేదిక కానుంది. మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది.