Indian Premier League 2026 season will officially kick off on March 28
IPL 2026 : టీ20 ప్రపంచకప్ 2026 ముగిసింది. భారత జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ముచ్చటగా మూడోసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఇక క్రికెట్ ప్రేమికుల దృష్టి అంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 పై పడింది. కాగా.. ఐపీఎల్ 2026 ప్రారంభ తేదీ మారిపోయింది. మార్చి 28 నుంచి ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది.
ఈ విషయాన్ని అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. ఆదివారం అహ్మదాబాద్‌లో నరేంద్రమోదీ స్టేడియంలో టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఈ విషయాన్ని తెలిపింది. వాస్తవానికి ఐపీఎల్ 2026 మార్చి 26 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. సీజన్‌కు ముందు ప్లేయర్లకు, ఫ్రాంఛైజీలకు కాస్త సమయం ఇచ్చేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2026 ప్రారంభ తేదీ పై స్పష్టత వచ్చినప్పటికి కూగా ఇప్పటి వరకు షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేయలేదు.
బెంగళూరులో ఐదు మ్యాచ్‌లు..
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ హోమ్ గేమ్‌లలో ఐదింటిని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించనున్నట్లు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం కార్యదర్శి సంతోషన్ మీనన్ తెలిపారు. టోర్నమెంట్‌లోని ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో ఒకదానితో పాటు ఐపీఎల్ 2026 ఫైనల్‌కు కూడా చిన్నస్వామి ఆతిథ్యం ఇస్తుందని వెల్లడించారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ మిగిలిన రెండు హోమ్ మ్యాచ్‌లను ఛత్తీస్ గడ్‌లోని రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆడనుంది.
🚨 Announcement 🚨
Get ready! #TATAIPL2026 is all set to start from the 28th of MARCH! pic.twitter.com/RF4Ixvo1J5
— Star Sports (@StarSportsIndia) March 8, 2026
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలిచిన తరువాత చిన్నస్వామి స్టేడియం వద్ద నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుని 11 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన తరువాత చిన్నస్వామిలో మ్యాచ్‌లు నిర్వహించకూడదని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇటీవల కొన్ని షరతులతో పలు మ్యాచ్‌లు నిర్వహించుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలిపింది.