Indian team did not get any prize money from icc after winning U19 World Cup
U19 World Cup 2026 : భారత జట్టు అండర్-19 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచింది. శుక్రవారం జింబాబ్వేలోని హరారే వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించి భారత్ ముచ్చటగా ఆరో సారి అండర్-19 ప్రపంచకప్‌ను ముద్దాడింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం బాదాడు. 80 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 15 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేశాడు. ఆ తరువాత 412 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకే కుప్పకూలింది.
ప్రైజ్ మనీ లేదు..
అండర్-19 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు భారీ ప్రైజ్‌మనీ దక్కి ఉంటుందని చాలా మంది భావించి ఉంటారు. అయితే.. అందులో ఎలాంటి వాస్తవం లేదు. అండర్-19 విజేతగా నిలిచినప్పటకి కూడా భారత జట్టుకు ప్రైజ్‌మనీగా ఒక్క రూపాయి కూడా ఐసీసీ ఇవ్వదు.
ఎందుకంటే అండర్-19 ప్రపంచకప్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వాణిజ్య టోర్నమెంట్‌గా నిర్వహించదు. యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు, అనుభవంతో పాటు వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడం కోసమే నిర్వహిస్తుంది. అందుకనే భారత్ అనే కాదు మరే జట్టు అండర్-19 ప్రపంచకప్ విజేతగా నిలిచినప్పటికి కూడా ఐసీసీ ప్రైజ్‌మనీ ఇవ్వదు.
బీసీసీఐ ప్రకటించే అవకాశం!
ఐసీసీ ఎలాంటి ప్రైజ్‌మనీ ఇవ్వకపోయినా, భారత ప్లేయర్లను ప్రోత్సహించేందుకు బీసీసీఐ మాత్రం ఆటగాళ్లకు ప్రోత్సాహకాలను అందస్తూ వస్తుంది. 2022లో యష్ ధుల్ నాయకత్వంలో భారత్ అండర్-19 ప్రపంచకప్ విజేతగా నిలిచిన సందర్భంలో జట్టులోని ప్రతి ప్లేయర్‌కు 40 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున అందించింది.
అదే విధంగా 2023, 2025 టైటిళ్లను గెలుచుకున్న భారత మహిళా అండర్-19 జట్లకు సమిష్టిగా రూ.5 కోట్లను అందించింది. మరి ప్రస్తుతం ఆయుష్ మాత్రే నాయకత్వంలోని జట్టుకు బీసీసీఐ ఎంత బహుమతిగా ప్రకటిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.