Ajinkya Rahane : గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి.. కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే కీలక వ్యాఖ్యలు.. ఆ ఒక్కడు..
మ్యాచ్‌లో గెలిచే స్థితి నుంచి ఓడిపోవడంపై కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే (Ajinkya Rahane )నిరాశను వ్యక్తం చేశాడు.
- Thota Vamshi Kumar
- Published On : April 10, 2026 / 07:30 AM IST
IPL 2026 Ajinkya Rahane comments after KKR lost match to LSG (pic credit@ IPL)
- ముకుల్ చౌదరి విధ్వంసం
- గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయిన కేకేఆర్
- ఆవేదన వ్యక్తం చేసిన అజింక్యా రహానే
Ajinkya Rahane : ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఏదీ కలిసి రావడం లేదు. గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కేకేఆర్ ఓడిపోయింది. ఈ సీజన్‌లో కేకేఆర్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా ఇది మూడో ఓటమి. కాగా.. ఈ మ్యాచ్‌లో గెలిచే స్థితి నుంచి ఓడిపోవడంపై కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే నిరాశను వ్యక్తం చేశాడు. ముకుల్ చౌదరి అసాధారణ ఇన్నింగ్స్ తో మ్యాచ్‌ను లాగేసుకున్నాడని చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో అంగ్క్రిష్ రఘువంశీ (45; 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అజింక్యా రహానే (41; 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోవ్‌మన్ పావెల్ (39 నాటౌట్; 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కామెరూన్ గ్రీన్ (32 నాటౌట్; 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 182 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. ఈ దశలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ముకుల్ చౌదరి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 54 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో లక్నో సరిగ్గా 20 ఓవర్లలో 7 వికెట్లు లక్ష్యాన్ని ఛేదించింది. లక్నో బ్యాటర్లలో ముకుల్ చౌదరితో పాటు ఆయుష్ బదోని (54; 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సునీల్ నరైన్, కార్తిక్ త్యాగి, కామెరాన్ గ్రీన్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఎంతో కష్టంగా ఉంది
ఇక ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై రహానే స్పందించాడు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టమని చెప్పుకొచ్చాడు. ఏదీఏమైనప్పటికి కూడా కుర్రాళ్లు అద్భుతంగా ఆడినట్లు తెలిపారు. ముకుల్ చౌదరి ఇన్నింగ్స్ మ్యాచ్‌ను మలుపు తిప్పిందన్నాడు. అతడు అద్భుతమైన షాట్లు ఆడాడని అన్నాడు. ఇక ఇలాంటి మ్యాచ్‌ల్లో తప్పులను వెతకకూడదన్నాడు.
ఇక ఈ పిచ్‌పై 180 నుంచి 185 పరుగులు చాలా మంచి స్కోరు అని చెప్పుకొచ్చాడు. తమ బ్యాటర్లు బాగా ఆడారని అన్నాడు. లక్నో ఇన్నింగ్స్ 18 ఓవర్ వరకు మ్యాచ్ మా నియంత్రణలోనే ఉంది. చివరి రెండు ఓవర్లలో ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము. ముకుల్‌తో పాటు వారి భాగస్వామ్యానికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. పిచ్ పై స్లో బంతులను కొట్టడం కాస్త కష్టమే. అందుకనే మా బౌలర్లు స్లో బంతులను ఎక్కువగా వేశారు. కొన్ని అద్భుతమైన బంతులను సంధించారు. అయినప్పటికి ముకుల్ అద్భుతమైన షాట్లు ఆడాడు.
రాజస్థాన్ రాయల్స్‌తో ఆర్‌సీబీ మ్యాచ్.. కోహ్లీని ఊరిస్తున్న భారీ రికార్డు ఇదే..
ఇక ఆఖరి ఓవర్‌లో అవేశ్ ఖాన్‌ను ఎక్కువ సేపు స్ట్రైకింగ్‌లో ఉంచాలని ఎక్కువ మంది ఫీల్డర్లను సర్కిల్ లోపల పెట్టాము. అయితే.. స్లో ఓవర్ రేటు కారణంగా ఐదుగురు ఫీల్డర్లు సర్కిల్ లోపల ఉంచాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో ఆఖరి ఓవర్ వేయడం చాలా కష్టం. ఏదీఏమైనప్పటికి ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తదుపరి మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేస్తాం. అని రహానే అన్నాడు.
