KKR vs SRH : సాకులు చెప్పడం లేదు.. మేం ఓడిపోవడానికి అసలు కారణం అదే.. అజింక్యా రహానే కామెంట్స్..
గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో (KKR vs SRH) కేకేఆర్ 65 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
- Thota Vamshi Kumar
- Published On : April 3, 2026 / 07:32 AM IST
IPL 2026 Ajinkya Rahane Comments after Kolkata Knight Riders lost match to Sunrisers Hyderabad
- ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇంకా బోణీ కొట్టని కేకేఆర్
- వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి
- సన్‌రైజర్స్ చేతిలో ఓడిపోవడానికి గల కారణాలు వెల్లడించిన రహానే
KKR vs SRH : ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఏదీ కలిసి రావడం లేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓడిపోయింది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 65 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ అజింక్యా రహానె స్పందించాడు. మిడిల్ ఆర్డర్ వైఫల్యం వల్లే తాము ఈ మ్యాచ్‌లో ఓడిపోయామన్నాడు. మరో రెండు పెద్ద భాగస్వామ్యాలు నమోదై ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ ఆటగాళ్లలో హెన్రిచ్ క్లాసెన్ (52; 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు. అభిషేక్ శర్మ (48; 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ట్రావిస్ హెడ్ (46; 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (39; 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించారు. కేకేఆర్ బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబాని నాలుగు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా రెండు వికెట్లు తీశాడు. కార్తిక్ త్యాగి, అనుకుల్ రాయ్ లు చెరో వికెట్ సాధించారు.
అనంతరం 227 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్ 16 ఓవర్లలో 161 పరుగులకు కుప్పకూలింది. కేకేఆర్ బ్యాటర్లలో అంక్రిష్ రఘువంశీ (52; 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. రింకూ సింగ్ (35; 25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్ మూడు వికెట్లు, మలింగ, నితీశ్‌కుమార్ రెడ్డి లు చెరో రెండు వికెట్లు తీశారు. హర్ష్ దూబె ఓ వికెట్ సాధించాడు.
అదే మేం చేసిన తప్పు..
మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ రహానే మాట్లాడుతూ.. ఓటమి తమకు నిరాశ కలిగించిందన్నాడు. భారీ లక్ష్యాలను ఛేదించేటప్పుడు భాగస్వామ్యాలు కీలకం అని చెప్పుకొచ్చాడు. మరో రెండు పెద్ద భాగస్వామ్యాలను నమోదు చేసి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదన్నాడు. కానీ తాము భాగస్వామ్యాలను నమోదు చేయలేకపోయామని తెలిపాడు. ఎప్పుడైనా సరే సెట్ అయిన బ్యాటర్ ఆఖరి వరకు బ్యాటింగ్ చేయాలన్నాడు.
ఇక సన్‌రైజర్స్ బ్యాటర్లకు లభించిన ఆరంభాన్ని చూస్తే.. తొలి 10 ఓవర్లలోనే 130 నుంచి 140 పరుగులు చేస్తారని అనిపించిందన్నాడు. అయితే.. తమ బౌలర్లు అద్భుతంగా పుంజుకుని కట్టడి చేశారన్నాడు. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో బంతి కాస్త ఆగుతూ వచ్చిందని రహానే తెలిపాడు. మొదటి ఇన్నింగ్స్‌తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్‌లో స్లో బాల్స్ మరింత గ్రిప్ అయ్యాయి. తాము వికెట్ మెరుగుపడుతుందని భావించామని, అయితే.. అలా జరగలేదన్నాడు. ఇవన్నీ కూడా ఓటమికి సాకులుగా తాను చెప్పడం లేదన్నాడు.
Virat Kohli : ఐపీఎల్ కెరీర్ గురించి ఐదు ప్రశ్నలు అడిగితే.. కోహ్లీ స్కోరు 4/5
భారీ లక్ష్య ఛేదనలో తమ జట్టుకు మంచి ఆరంభం లభించిందన్నాడు.. తొలి ఆరు ఓవర్లలోనే తాము 78 పరుగులు చేశామన్నాడు. గ్రీన్ రనౌట్ కావడంతో ఎక్స్‌ట్రా వికెట్ కోల్పోయామని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో తప్ప మిగతా మ్యాచ్ అంతా తాము బాగానే ఆడామని అన్నాడు.
ఇక హోమ్ గేమ్‌లను గెలవడం చాలా ముఖ్యమన్నాడు. తమ వ్యూహాలను మరోసారి చర్చించుకుంటామన్నాడు. తుది జట్టులో అదనపు బ్యాటర్‌ను తీసుకోవాలా? బౌలర్‌ను తీసుకోవాలా? అనే దాని గురించి ఆలోచిస్తామన్నాడు. తదుపరి మ్యాచ్‌కు మరో మూడు నుంచి నాలుగు రోజుల సమయం ఉందని, కాబట్టి ఈ మ్యాచ్ గురించి పెద్దగా ఆలోచించడం లేదన్నాడు. అంతా సర్దుకుంటుందని తాను భావిస్తున్నట్లు రహానే తెలిపాడు.
