IPL 2027 : చెన్నై సూపర్ కింగ్స్‌లో అనూహ్య మార్పులు.. భారీ ధరకు కొన్న ఆటగాడిపై వేటు..! అసలు కారణం ఇదే..
IPL 2027 CSK : ఐపీఎల్ -2027 ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం జట్టులో కీలక మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో పలువురు ప్లేయర్లను వదులుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Prashant Veer
IPL 2027 CSK : ఐపీఎల్ -2027 ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం జట్టులో కీలక మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారీ ధరకు కొనుగోలు చేసిన యువ ఆటగాడిని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read : IND vs NZ : భారత జట్టు వరల్డ్ రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి టీంగా గుర్తింపు..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20ఏళ్ల ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌ను ఐపీఎల్ 2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ.14.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండటంతో అతడిపై సీఎస్కే భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ప్రశాంత్ వీర్ విఫలమయ్యాడు. ఆ సీజన్లో ఆరు మ్యాచ్‌లు ఆడి అతడు.. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 90 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 43 పరుగులు. బౌలింగ్‌లో ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. దీంతో అతడిని జట్టు నుంచి విడుదల చేసేందుకు సీఎస్కే యాజమాన్యం నిర్ణయించినట్లు సమాచారం.. మరోవైపు.. ప్రశాంత్ వీర్ ను పూర్తిగా వదులుకోవడం కాకుండా.. వేలంలో తక్కువ ధరకు తిరిగి దక్కించుకోవాలనే వ్యూహాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.
ప్రశాంత్ వీర్‌తో పాటు రాజస్థాన్‌కు చెందిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ కార్తీక్ శర్మను కూడా సీఎస్కే రూ.14.2 కోట్లకే కొనుగోలు చేసింది. అయితే వీర్‌తో పోలిస్తే కార్తీక్ శర్మ మెరుగైన ప్రదర్శన చేశాడు. 2026 సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడి 295 పరుగులు సాధించాడు. 32.77 సగటుతో బ్యాటింగ్ చేశాడు. అత్యధిక స్కోరు 71 పరుగులు. ఈ నేపథ్యంలో కార్తీక్ శర్మను కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్, విడుదల జాబితాను ప్రకటించేందుకు ఫ్రాంచైజీలకు నవంబర్ 15 వరకు గడువు ఉంది. డిసెంబర్ 16న గోవాలో మినీ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వీర్ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం సీఎస్కే పర్స్‌లో రూ.2.4 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఐపీఎల్ జీతాల పరిమితిలో వార్షికంగా రూ.5 కోట్ల పెంపుతో ఈ మొత్తం రూ.7.4 కోట్లకు చేరనుంది. అయినప్పటికీ వేలంలో కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేయాలంటే మరిన్ని నిధులు అవసరం. అందుకే కొంతమంది ఆటగాళ్లను విడుదల చేసి పర్స్‌ను పెంచుకోవాలని సీఎస్కే భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రక్రియలో భాగంగానే ప్రశాంత్ వీర్ తోపాటు మరికొందరు ఆటగాళ్లను విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
