David Miller : డేవిడ్ మిల్లర్ ఎంత పని చేస్తివి.. కుల్దీప్ ఉన్నాడనే అలా చేశావా.. ఇప్పుడు చూడు..
చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు డేవిడ్ మిల్లర్ (David Miller) చేసిన తప్పు కారణంగా ఢిల్లీ ఓడిపోయింది.
- Thota Vamshi Kumar
- Published On : April 9, 2026 / 08:31 AM IST
IPL 2026 DC vs GT David Miller refuse the single in last over fifth ball (pic credit@ipl)
- ఢిల్లీ గెలిచేందుకు ఆఖరి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం
- ఐదో బంతికి సింగిల్ తీసేందుకు నిరాకరించిన మిల్లర్
- ఆరో బంతికి కుల్దీప్ రనౌట్
- ఒక్క పరుగు తేడాతో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్
David Miller : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 1 పరుగు తేడాతో ఓడిపోయింది. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచి ఉండాల్సి ఉంది. చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు డేవిడ్ మిల్లర్ (David Miller ) చేసిన తప్పు కారణంగా ఢిల్లీ ఓడిపోయింది.
అసలేం జరిగిందంటే?
211 పరుగుల లక్ష్య ఛేదనలో 17 ఓవర్లు పూర్తి అయ్యే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 17వ ఓవర్ చివరి బంతికి కేఎల్ రాహుల్ ఔట్ కావడంతో రిటైర్ హర్ట్‌తో మైదానాన్ని వీడిన డేవిడ్ మిల్లర్ క్రీజులోకి వచ్చాడు. అప్పటికి ఢిల్లీ విజయ లక్ష్యం 18 బంతుల్లో 45 పరుగులుగా ఉంది. మిల్లర్ చేతికి గాయం కావడంతో ఢిల్లీ గెలవడం కష్టమేనని అనిపించింది.
అందుకు తగ్గట్టుగానే 18వ ఓవర్‌ను వేసిన కగిసో రబాడా కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఢిల్లీ విజయ సమీకరణం 12 బంతుల్లో 36 పరుగులుగా నిలిచింది. అయితే.. 19వ ఓవర్‌లో మిల్లర్ విధ్వంసం సృష్టించాడు. సిరాజ్ వేసిన ఈ ఓవర్‌లో మిల్లర్ రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టగా.. విప్రజ్ నిగమ్ ఓ ఫోర్ కొట్టడంతో 23 పరుగులు వచ్చాయి.
Watch it yourself to believe it 🤯
A nerve-wrecking finish to a #TATAIPL classic 🥶 @gujarat_titans fans, you can breathe now 😅
Updates ▶️ https://t.co/oOdPR1oSeP#TATAIPL | #KhelBindaas | #DCvGT pic.twitter.com/Wh5EQvshqd
— IndianPremierLeague (@IPL) April 8, 2026
చివరి ఓవర్‌లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. ప్రసిద్ధ్ కృష్ట వేసిన తొలి బంతికి విప్రజ్ ఫోర్ కొట్టి ఆ తరువాత బంతికి ఔట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ మూడో బంతికి సింగిల్ తీసి మిల్లర్‌కు స్ట్రైక్ ఇవ్వగా.. అతడు నాలుగో బంతికి సిక్స్ బాదాడు. దీంతో ఢిల్లీ విజయసమీకరణం రెండు బంతుల్లో రెండు పరుగులుగా మారింది. స్ట్రైకింగ్‌లో మిల్లర్ ఉండడంతో అంతా ఢిల్లీ గెలుస్తుందని భావించారు.
అయితే.. ఐదో బంతిని డీప్ స్క్వేర్ లెగ్ దిశగా మిల్లర్ షాట్ ఆడాడు. ఈజీ సింగిల్ వచ్చే అవకాశం ఉన్నప్పటికి కూడా అతడు నిరాకరించాడు. మిల్లర్ చేసిన ఈ తప్పే మ్యాచ్ ఓటమికి కారణమైంది. ఆఖరి బంతికి మిల్లర్ బాల్‌ను కూడా టచ్ లేకపోయాడు. బై కోసం ప్రయత్నించగా కుల్దీప్ రనౌట్ కావడంతో ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.
అదే ఐదో బంతికి మిల్లర్ సింగిల్ తీసి ఉంటే మ్యాచ్ టై అయ్యేది. కుల్దీప్ ఆఖరి బంతికి షాట్ కొట్టినా, లేదంటే బై రూపంలో సింగిల్ తీసి ఉన్నా కూడా ఢిల్లీ గెలిచేది. ఒకవేళ ఔట్ అయినా కూడా మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసి ఉండేది. ప్రస్తుతం దీనిపైనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏదీ ఏమైనప్పటికి కూడా గాయంతో అద్భుతంగా పోరాడిన మిల్లర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
