Axar Patel : బెంగళూరు పై ఘోర ఓటమి.. అక్షర్ పటేల్ హాట్ కామెంట్స్.. ఏం జరిగిందో ఇంకా అర్థం కావడం లేదు.. ఆశ్చర్యపోయా..
ఆర్‌సీబీ చేతిలో ఘోర పరాజయం పై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ (Axar Patel)స్పందించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- April 28, 2026 / 08:33 AM IST
IPL 2026 DC vs RCB Axar Patel comments after Delhi Capitals lost match to Royal Challengers Bengaluru
- ఆర్‌సీబీ చేతిలో ఢిల్లీ ఘోర ఓటమి
- స్పందించిన అక్షర్ పటేల్
- ఈ మ్యాచ్‌లో ఏం జరిగిందో తనకు ఇంకా అర్థం కావడం లేదని వ్యాఖ్య
Axar Patel : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. సోమవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఎనిమిది మ్యాచ్‌లో ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం. ఈ ఘోర పరాజయానికి ఎవరిని నిందించలేనని, అసలు ఏం జరిగిందో తనకే అర్థం కావడం లేదని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 1 6.3 ఓవర్లలో 75 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్ పోరెల్ (30; 33 బంతుల్లో 3 ఫోర్లు), డేవిడ్ మిల్లర్ (19; 18 బంతుల్లో 3 ఫోర్లు), కైల్ జేమీసన్ (12; 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. బెంగళూరు బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ నాలుగు, భువనేశ్వర్ కుమార్ మూడు, రసిఖ్ సలాం దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా లు తలా ఓ వికెట్ తీశారు.
ఆ తరువాత 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్‌సీబీ 6.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. బెంగళూరు బ్యాటర్లలో దేవ్‌దత్ పడిక్కల్ (34 నాటౌట్; 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (23 నాటౌట్; 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు), జాకబ్ బెథెల్ (20; 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) లు వేగంగా ఆడారు. ఢిల్లీ బౌలర్లలో కైల్ జేమీసన్ ఓ వికెట్ తీశాడు.
ఏం జరిగిందో ఇంకా అర్థం కావడం లేదు..
ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో అసలు ఏం జరిగిందో తనకు ఇప్పటికి కూడా అర్థం కావడం లేదన్నాడు. క్రికెట్‌లో ప్రతి రోజు అప్రమత్తంగా ఉండాలన్నాడు. ఈ ఘోర ఓటమిని సాధ్యమైనంత త్వరగా మరిచిపోయి ముందుకు సాగుతామని చెప్పుకొచ్చాడు.
గుజరాత్ చేతిలో ఓడిపోయిన తరువాత జట్టు మూమొంటమ్ దెబ్బతిందా అనే ప్రశ్న ఎదరు కాగా.. అవునని సమాధానం ఇచ్చాడు. వాస్తవం చెప్పాలంటే క్రికెట్‌లో ఇలా జరిగి ఉంటే బాగుంటుంది? అలా జరిగితే బాగుంటుంది అని అనిపిస్తుందన్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో కూడా ఆ క్యాచ్ పట్టి ఉంటే లేదా ఆ రన్ తీసి ఉంటే బహుశా ఆ ఊపు అలాగే కొనసాగి ఉండేదేమోనని అన్నాడు.
అయితే.. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయన్నాడు. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. క్రికెట్‌లో ప్రతి రోజు అప్రమత్తంగా ఉండాలన్నాడు. ఐపీఎల్ చాలా కఠినమైన టోర్నీ అని తెలిపాడు. ఏ మ్యాచ్‌లో కూడా విజయం సులువుగా దక్కదన్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేయాలన్నాడు.
మూమొంటమ్ ముఖ్యమేనని, అదే సమయంలో అలా జరిగి ఉంటే బాగుండేది, ఇలా జరిగితే బాగుండేది అని ఆలోచిస్తూ కూర్చోలేమన్నాడు. ఈ మ్యాచ్‌ను వీలైన త్వరగా మరిచిపోయి తదుపరి మ్యాచ్‌పై దృష్టి సారించాలని జట్టు సభ్యులకు సూచించాడు. ప్రతి కూలంగా ఆలోచిస్తే మ్యాచ్‌లు ఓడిపోతారు అదే సానుకూలంగా ఉంటే రాణించగలరు అని తెలిపాడు.
Virat Kohli : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
ఈ రోజు తమకు చెడ్డ రోజు అని, ఒకరిపై నిందలు వేయడం తగదన్నాడు. సానుకూలంగా ఆలోచిస్తూ గత ఆరు లేదా ఏడు మ్యాచ్‌ల్లో ఏం చేశామో దాన్నే కొనసాగించాలన్నాడు. ఇక ఈ మ్యాచ్ ఆరంభంలో బంతి స్వింగ్ అయిన తీరు చూసి ఆశ్చర్యపోయాను అని చెప్పుకొచ్చాడు. వారిద్దరు (భువీ, హేజిల్‌వుడ్) ప్రపంచ స్థాయి బౌలర్లు అని, వారు ప్రపంచంలో ఎక్కడైనా బంతిని స్వింగ్ చేయగలరన్నాడు. అయితే.. తమ జట్టు ఓపెనర్లు లేదా టాప్ ఆర్డర్ బ్యాటర్లలో ఒకరు ఆ మొదటి రెండు ఓవర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని ఉంటే బహుశా పరిస్థితి మరోలా ఉండేదన్నాడు. ఏదీఏమైనప్పటికి వారిద్దరిని (భువీ, హేజిల్‌వుడ్)ను అభినందించాలని అక్షర్ పటేల్ అన్నాడు.
