Jason Holder : ఆర్‌సీబీ కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ క్యాచ్ ఔట్ పై వివాదం.. ఆ క్యాచ్ అందుకున్న జేస‌న్ హోల్డ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు..

అది స‌రైన క్యాచ్ అని, ర‌బాడని ఢీ కొట్టేలా క‌నిపించిన‌ప్ప‌టికి క్యాచ్ పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు జేసన్ హోల్డ‌ర్ (Jason Holder) తెలిపాడు.

IPL 2026 GT Vs RCB Jason Holder comments after PLAYER OF THE MATCH award (pic credit@ipl)

  • వివాదాస్ప‌ద క్యాచ్ పై స్పందించిన జేస‌న్ హోల్డ‌ర్‌
  • తాను క్యాచ్‌ను స‌రిగ్గానే అందుకున్నాన‌ని వివ‌ర‌ణ‌

Jason Holder : ఐపీఎల్ 2026లో భాగంగా గుజ‌రాత్ టైటాన్స్‌తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు గురువారం (ఏప్రిల్ 30న) త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ ఔట్ అయిన తీరు వివాదాస్ప‌ద‌మైంది. దీనిపై ఆ క్యాచ్ అందుకున్న గుజ‌రాత్ ఫీల్డ‌ర్ జేసన్ హోల్డ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. అది స‌రైన క్యాచ్ అని చెప్పుకొచ్చాడు. ర‌బాడని ఢీ కొట్టేలా క‌నిపించిన‌ప్ప‌టికి క్యాచ్ పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిపాడు.

ఆర్‌సీబీ ఇన్నింగ్స్ 8వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఓవ‌ర్‌ను గుజ‌రాత్ బౌల‌ర్ అర్షద్ ఖాన్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని నాలుగో బంతికి ర‌జ‌త్ పాటిదార్ భారీ షాట్ ఆడాడు. డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జేస‌న్ హోల్డ‌ర్ డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. థ‌ర్డ్ అంపైర్ ఔట్ గా ప్ర‌క‌టించ‌గా..  బంతి నేలకు తగిలినట్లు రిప్లేలో క‌నిపించింది. ఈ క్యాచ్ వివాదాస్ప‌ద‌మైంది.

ఎక్క‌డికి వెళ్లినా బంతి నా వ‌ద్ద‌కే..

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన జేస‌న్ హోల్డ‌ర్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది. ఈ అవార్డు అందుకున్న అనంత‌రం హోల్డ‌ర్ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించాడు. త‌మ జ‌ట్టు విజ‌యం సాధించ‌డం ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా ఈ రోజు బాగా క‌లిసి వ‌చ్చింద‌న్నాడు. కొన్ని రోజులు ఇలా అనుకూలంగా ఉంటాయ‌న్నాడు. ఇక జ‌ట్టు మొత్తం బాగా ఆడింద‌న్నాడు. ఆరంభంలో తాము కాస్త ఆందోళ‌న‌గా ఉన్న‌ప్ప‌టికి కూడా తొలి ఓవ‌ర్ త‌రువాత తాము వికెట్లు తీయ‌గ‌లిగామ‌న్నాడు.

also read : ర‌జ‌త్ పాటిదార్ విష‌యంలో కోహ్లీకి కోప‌మొచ్చింది.. అంపైర్‌తో వాద‌న‌.. అది ఔట్ కాద‌య్యా..

ముఖ్యంగా ప‌వ‌ర్ ప్లేలో ర‌బాడ‌, సిరాజ్ బౌలింగ్ చేసిన తీరు చాలా బాగుంద‌న్నాడు. వికెట్లు తీసి మ్యాచ్‌ను వారు త‌మ వైపుకు తిప్పారన్నాడు. ఇక ర‌జ‌త్ పాటిదార్ క్యాచ్ ప‌ట్టే స‌మ‌యంలో క‌గిసో ర‌బాడ‌ను తాను గ‌మ‌నించాన‌ని అన్నాడు. అత‌డిని ఢి కొట్ట‌కూడ‌దని అనుకున్నాన‌ని, ఒక‌వేళ ఢీ కొని ఉంటే ఎవ‌రికి దెబ్బ త‌గిలేదో త‌న‌కు తెలియ‌ద‌న్నాడు. ఏదీ ఏమైన‌ప్ప‌టికి కూడా బంతి కింద ప‌డ‌కుండా క్యాచ్ అందుకోవాల‌నే నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా వివ‌రించాడు. అనుకున్న‌ట్లుగానే చ‌క్క‌గా క్యాచ్ అందుకున్నాన‌ని అన్నాడు.

ఇక ఈ రోజు తాను ఫీల్డింగ్‌లో ఎక్క‌డికి వెళ్లినా కూడా బంతి త‌న వ‌ద్దకే వ‌చ్చింద‌న్నాడు. వాస్త‌వానికి దాని కోసం తాను ఏమీ చేయ‌లేద‌న్నాడు. కొన్ని సార్లు అవ‌కాశాలు మ‌న వ‌ద్ద‌కు వ‌స్తాయ‌ని, దాన్ని అందిపుచ్చుకుని జ‌ట్టు విజ‌యాల‌కు దోహ‌ద‌ప‌డినందుకు ఆనందంగా ఉంద‌న్నాడు. ఇక టీమ్ మేనేజ్‌మెంట్ గురించి మాట్లాడుతూ.. ఫ్రాంఛైజీ ప‌ని చేసే విధానం బాగుంద‌ని చెప్పుకొచ్చాడు. కోచ్ ఆశిష్ నెహ్రా ప్ర‌ణాళిక‌లు చాలా స్ప‌ష్టంగా ఉంటాయ‌న్నాడు. జ‌ట్టుకు అవ‌స‌రం అయిన‌ప్పుడు రాణించ‌డ‌మే త‌న ప‌ని, ఏదీఏమైన‌ప్ప‌టికి కూడా జ‌ట్టుకు విజ‌యం అందించ‌డ‌మే త‌న లక్ష్యం అని జేస‌న్ హోల్డ‌ర్ తెలిపాడు.