IPL 2026 : ఆఖర్లో అద్భుతం.. అతని సలహాతోనే విజయం సాధించాం.. నా గుండె ఆగినంతపనైంది.. ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ కీలక కామెంట్స్

IPL 2026 : ఐపీఎల్ -2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య శనివారం రాత్రి మ్యాచ్ జరిగింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది.

Rajasthan Royals Captain Riyan Parag

  • గుజరాత్ టైటాన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ విజయం
  • చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్
  • ఆఖర్లో ఆర్ఆర్ బౌలర్ల సూపర్ బౌలింగ్

IPL 2026 : ఐపీఎల్ -2026 సీజన్లో భాగంగా శనివారం అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చివరికి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కీలక కామెంట్స్ చేశాడు.

Also Read : Virat Kohli : ఐపీఎల్ రూల్స్‌ను బ్రేక్ చేస్తున్న ఆర్‌సీబీ.. తుది జ‌ట్టులో న‌లుగురు కాదు ఏకంగా ఐదుగురు విదేశీ ఆట‌గాళ్లు.. కోహ్లీ ఏమ‌న్నాడంటే?

రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. జట్టు విజయంపై కీలక కామెంట్స్ చేశాడు.


రియాన్ మాట్లాడుతూ.. చివర్లో ఉత్కంఠతో గుండె ఆగినంత పనైంది. చివర్లో మేము రిస్క్ తీసుకున్నాం. అది మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఆఖరి రెండు ఓవర్లు నిజంగా అద్భుతం. మేము ఒక రిస్క్ తీసుకున్నాం.. బంతి ఫుల్‌లెంగ్త్‌లో వేయాలని నిర్ణయించుకున్నాం. మా బౌలర్లు ఈ ప్లాన్‌ను పక్కాగా అమలు చేశారు. నిజానికి నేను బౌలింగ్ ఆర్డర్‌ను మార్చాలనుకున్నాను. కానీ, ఆ క్రెడిట్ అంతా ధ్రువ్ జురెల్‌కే దక్కుతుంది. 19వ ఓవర్లో జోప్రాతోనే వేయించమని అతను నాకు సలహా ఇచ్చాడు. ఆ చివరి రెండు ఓవర్లలో బంతిని సాధ్యమైనంత వేగంగా.. యార్కర్లు సంధించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ మేరకు విజయం సాధించామని రియాన్ పరాగ్ చెప్పాడు.


ఈ టోర్నీ కోసం ధ్రువ్ జురెల్ చాలా కష్టపడ్డాడు. గతంలో అతను 6, 7వ స్థానాల్లో బ్యాటింగ్ చేసేవాడు. ఇప్పుడు మూడో స్థానంలో ఆడే అవకాశం వచ్చింది. అతను ఖచ్చితంగా మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేయాలని మొదట చెప్పింది నేనే. ఈ సీజన్లో అతను 700కుపైగా పరుగులు సాధించి మాకు టైటిల్ గెలిపిస్తాడని ఆశిస్తున్నా అంటూ రియాన్ పరాగ్ పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటర్లు యశస్వి జైస్వాల్(36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55), ధ్రువ్ జురెల్(42 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ(18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 31) దూకుడుగా ఆడాడు. గుజరాత్ బౌలర్లలో కగిసో రబడా(2/42) రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.

గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్లు సాయి సుదర్శన్(44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73) హాఫ్ సెంచరీతో రాణించినా.. చివర్లో రషీద్ ఖాన్(16 బంతుల్లో 3 ఫోర్లతో 24), కగిసో రబాడ(16 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 23 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రవి బిష్ణోయ్(4/41) నాలుగు వికెట్లు తీసి గుజరాత్ టైటాన్స్ పతనాన్ని శాసించాడు.