IPL 2026 : మా ఓటమికి ప్రధాన కారణాలివే.. హార్దిక్ పాండ్యా కీలక కామెంట్స్.. రోహిత్ శర్మకు గాయంపై..

IPL 2026 : ఆర్సీబీపై ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. జట్టు ఓటమిపై కీలక కామెంట్స్ చేశాడు.

hardik pandya

  • ఆర్సీబీ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి
  • ఓటమి తరువాత హార్దిక్ పాండ్యా కీలక కామెంట్స్
  • తమ వ్యూహాలు మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్య

IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్ (MI) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ సత్తా చాటింది. 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టుపై విజయం సాధించింది.

Also Read : IPL 2026 : పక్షిలా గాల్లోకి ఎగిరి.. బాబోయ్.. ఏం పట్టేశావ్ బాసూ.. సర్ఫరాజ్ ఖాన్ సూపర్ క్యాచ్.. వీడియో వైరల్

తొలుత రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జట్టు బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై జట్టు బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 222 పరుగులు మాత్రమే చేయగలిగారు. రోహిత్ శర్మ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగి వెళ్లిపోయాడు. చివరిలో హార్ధిక్, రూథర్ ఫర్డ్ ఫోర్లు, సిక్సర్లతో అదరగొట్టినప్పటికీ.. మ్యాచ్ లో విజయం సాధించలేక పోయారు. దీంతో ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది.


మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. గత మూడు మ్యాచ్‌లలో తమ వ్యూహాలు బెడిసి కొట్టాయని తెలిపాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో బ్యాటింగ్, బౌలింగ్ ఏమాత్రం బాలేదని అభిప్రాయపడ్డాడు. ప్రతీ మ్యాచ్‌లో ఆరంభంలోనే వెనుకబడిపోతున్నామని, మ్యాచ్ మొత్తం పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అసహనం వ్యక్తం చేశాడు.

తమ ప్రణాళికలను పూర్తిగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని హార్దిక్ పేర్కొన్నారు. ఆర్సీబీపై మ్యాచ్‌లో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయాం.. అదేసమయంలో బౌలింగ్‌లోనూ చాలా ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాం. ఈ వరుస పరాజయాల నేపథ్యంలో మేము కచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మా తదుపరి మ్యాచ్‌కు రెండు రోజుల విరామం ఉంది. ఈ రెండు రోజుల్లో మా లోపాలను సరిదిద్దుకోవాలి. చాలా విషయాలపై పునరాలోచన చేయాలి. మా వ్యూహాలు అస్సలు పనిచేయడం లేదు. తమ పొరపాట్లను సరిదిద్దుకొని స వచ్చే మ్యాచ్‌ల నుంచి పుంజుకొని విజయం దిశగా పయణించేందుకు ప్రయత్నిస్తామని హార్దిక్ పాండ్యా అన్నారు.

ఇదిలాఉంటే.. ముంబైతో మ్యాచ్ సమయంలో రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ మరో ఓపెనర్ రికెల్టన్ తో కలిసి వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆరో ఓవర్లో జట్టు స్కోరు 57 పరుగుల వద్ద రోహిత్ (19) తొడ కండరాల గాయం వల్ల రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగి వెళ్లిపోయాడు. ఆ తరువాత నుంచి ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ గతితప్పింది. మిగిలిన బ్యాటర్లు వెంటవెంటనే ఔట్ అయ్యారు. రోహిత్ శర్మ మళ్లీ క్రీజులోకి వస్తాడని ఫ్యాన్స్ భావించినప్పటికీ అలా జరగలేదు. దీంతో రోహిత్ శర్మ పెద్దగాయమే అయిందన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో రోహిత్ వచ్చే మ్యాచ్ లలో ఆడతాడా.. ఒకటి రెండు మ్యాచ్ లకు విశ్రాంతి తీసుకుంటాడా అనే అంశంపై స్పష్టంత రావాల్సి ఉంది.