MI vs PBKS : తీవ్ర నిరాశ‌లో మునిగిపోయిన హార్దిక్ పాండ్యా.. లోపం ఆటగాళ్లలోనా? జ‌ట్టులోనా? ప్ర‌ణాళిక‌ల్లోనా?

పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ ఏడు వికెట్ల తేడాతో (MI vs PBKS )ఓడిపోయింది.

IPL 2026 Hardik Pandya key comments after Mumbai Indians lost match to Punjab Kings (pic credit@ipl)

  • గురువారం పంజాబ్ కింగ్స్ పై ఓట‌మి
  • ఈ సీజ‌న్‌లో ముంబైకి ఇది నాలుగో ఓట‌మి
  • తీవ్ర నిరాశ‌లో మునిగిన ముంబై కెప్టెన్‌
  • ఏం మాట్లాడాలో అర్థం కావ‌డం లేద‌ని వ్యాఖ్య

MI vs PBKS : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. గురువారం వాంఖ‌డే వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సీజ‌న్‌లో ముంబైకి ఇది వ‌రుస‌గా నాలుగో ఓట‌మి. దీని గురించి హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఎక్క‌డ త‌ప్పు జ‌రిగిందో అర్థం కావ‌డం లేద‌న్నాడు. త‌మ జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న గురించి చెప్పేందుకు ఏమీ లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

క్వింట‌న్ డికాక్ (112 నాటౌట్; 60 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) శ‌త‌కం బాద‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 195 ప‌రుగులు చేసింది. న‌మ‌న్ ధీర్ (50; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మార్కో జాన్సెన్, శశాంక్ సింగ్ లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

ఆ త‌రువాత ప్రభ్‌సిమ్రన్ సింగ్ (80 నాటౌట్ ; 39 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), శ్రేయ‌స్ అయ్య‌ర్ (66; 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) మెరుపు హాఫ్ సెంచ‌రీల‌తో క‌దం తొక్క‌డంతో 196 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పంజాబ్ జ‌ట్టు 16.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. ముంబై బౌల‌ర్ల‌లో ఘజన్‌ఫర్ రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

లోపం ఎక్క‌డుంది?

మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మిపై ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఓట‌మి తీవ్ర నిరాశ క‌లిగించింద‌న్నాడు. పంజాబ్ కింగ్స్ మూడు విభాగాల్లో త‌మ కంటే ఎంతో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసింద‌ని అంగీక‌రించాడు. నిజం చెప్పాలంటే ఈ ఓట‌మి గురించి మాట్లాడేందుకు త‌న వ‌ద్ద మాట‌లు లేవ‌న్నాడు. తాము ఎక్క‌డ వెనుకబడి ఉన్నామో తెలుసుకోవడానికి పునఃసమీక్షించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు. లోపం ఆటగాళ్లలోనా? జ‌ట్టులోనా? ప్ర‌ణాళిక‌ల్లోనా? అనేది విశ్లేషించుకోవాలి. ఆ త‌రువాత ఏం చేయాల‌నే దానిపైన పూర్తి దృష్టి సారిస్తామ‌న్నాడు.

ALSO READ : శ్రేయ‌స్ అయ్య‌ర్ అద్భుత ఫీల్డింగ్ విన్యాసం.. బిత్త‌ర‌పోయిన రోహిత్, సూర్య‌.. వీడియో

ఇక పంజాబ్ జ‌ట్టుకు క్రెడిట్ ఇవ్వాల్సిందేన‌ని అన్నాడు. బంతి రివ‌ర్స్ సింగ్ అయింద‌ని, రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్ర‌భావం వ‌ల్ల ప‌రిస్థితులు కొంచెం బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిన‌ప్ప‌టికి కూడా పంజాబ్ అద్భుతంగా ఆడింద‌న్నాడు. మూడు విభాగాల్లో వాళ్లు త‌మ కంటే మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేశాడ‌ని అన్నాడు. ఇదే త‌మ ఓట‌మికి కార‌ణ‌మ‌న్నాడు.

ఇలాగే కొన‌సాగితే సానుకూల ఫ‌లితాలు వ‌స్తాయో లేదో చూసి జ‌ట్టు కాంబినేష‌న్ విష‌యంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామ‌న్నాడు. చాలా ప్ర‌శ్న‌లు త‌మ వెంటాడుతున్నాయ‌ని, వాటికి స‌మాధానాల‌ను వెత‌కాల్సి ఉంది అని హార్దిక్ అన్నాడు.