KKR vs SRH : కోల్‌క‌తా పై విజ‌యం.. నేను సంతోషంగా లేను.. స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ ఇషాన్ కిష‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు గెలుపు (KKR vs SRH) బోణీ కొట్టింది.

IPL 2026 Ishan Kishan comments after Sunrisers Hyderabad win the match against Kolkata Knight Riders (pic credit@ipl)

  • ఐపీఎల్ 2026లో గెలుపు బోణీ కొట్టిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌
  • కేకేఆర్ పై 65 ప‌రుగుల తేడాతో విజ‌యం
  • ఆనందాన్ని వ్య‌క్తం చేసిన కెప్టెన్ ఇషాన్ కిష‌న్

KKR vs SRH : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు గెలుపు బోణీ కొట్టింది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 65 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం ప‌ట్ల స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ ఇషాన్ కిష‌న్ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత‌ బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 226 ప‌రుగులు చేసింది. స‌న్‌రైజ‌ర్స్ ప్లేయ‌ర్ల‌లో హెన్రిచ్ క్లాసెన్ (35 బంతుల్లో 52 ప‌రుగులు) అర్థ‌శ‌త‌కం సాధించాడు. అభిషేక్ శ‌ర్మ (21 బంతుల్లో 48 ప‌రుగులు), ట్రావిస్ హెడ్ (21 బంతుల్లో 46 ప‌రుగులు). నితీశ్ కుమార్ రెడ్డి (24 బంతుల్లో 39 ప‌రుగులు) వేగంగా ఆడారు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో బ్లెస్సింగ్ ముజరబాని నాలుగు, వైభవ్ అరోరా రెండు, కార్తిక్ త్యాగి, అనుకుల్ రాయ్ లు చెరో వికెట్ ప‌డ‌గొట్టాడు.

227 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ 16 ఓవ‌ర్ల‌లో 161 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో అంక్రిష్ రఘువంశీ (29 బంతుల్లో 52) అర్థ‌శ‌త‌కం చేయ‌గా.. రింకూ సింగ్ (25 బంతుల్లో 35 ప‌రుగులు) రాణించాడు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో జ‌య‌దేవ్ ఉనాద్క‌త్ మూడు, మలింగ, నితీశ్‌కుమార్ రెడ్డి లు చెరో రెండు, హ‌ర్ష్ దూబె ఓ వికెట్ తీశారు.

ఆ విష‌యంలో సంతోషంగా లేను..

మ్యాచ్ అనంత‌రం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ ఇషాన్ కిష‌న్ మాట్లాడుతూ.. ఐపీఎల్ 2026 సీజన్‌లో గెలుపు బోణీ కొట్ట‌డం సంతోషాన్ని ఇచ్చింద‌న్నాడు. (తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో ఎస్ఆర్‌హెచ్ ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే). ఈ గెలుపు క్రెడిట్ ఓపెన‌ర్ల‌దేన‌ని చెప్పుకొచ్చాడు. జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న పై ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు.

వ్య‌క్తిగ‌తంగా త‌న ఆట‌తీరు ప‌ట్ల సంతోషంగా లేన‌న్నాడు. మైదానంలో జ‌ట్టు చూపిన నిబద్ద‌త ప‌ట్ల సంతోషంగా ఉన్నాన‌ని అన్నాడు. ప్ర‌తి ఒక్క‌రు త‌మ శ‌క్తి వంచ‌న లేకుండా గెలుపు కోసం కృషి చేశార‌ని అన్నాడు. జ‌ట్టు నుంచి తాను కోరుకున్న‌ది కూడా అదేన‌న్నాడు. ఇక ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్‌, అభిషేక్ శ‌ర్మ‌లు అద్భుతంగా ఆడార‌ని మెచ్చుకున్నాడు. వారి దూకుడు కార‌ణంగా ప‌వ‌ర్ ప్లేలో 80 ప‌రుగులు వ‌చ్చాయ‌న్నాడు. దీంతో మిగిలిన బ్యాట‌ర్లు సింగిల్స్ తీసుకోవ‌డానికి, పిచ్ ఎలా ఉందో అర్థం చేసుకోవ‌డానికి అద‌న‌పు స‌మ‌యం దొరికింద‌న్నాడు.

వీరిద్ద‌రితో పాటు ఆఖ‌రిలో హెన్రిచ్ క్లాసెన్‌, నితీశ్ రెడ్డిలు గొప్ప‌గా ఆడార‌న్నాడు. మొత్తంగా ఇది జ‌ట్టు విజ‌యం అని చెప్పుకొచ్చాడు. ఇక కేకేఆర్ ఆట‌గాడు ఫిన్ అలెన్ ఎంత‌టి ప్ర‌మాద‌క‌ర ఆట‌గాడో అంద‌రికి తెలుసున‌ని అన్నాడు. అత‌డు ఒక్క‌సారి చెల‌రేగితే ఆప‌డం చాలా క‌ష్ట‌మ‌న్నాడు. అయితే.. హ‌ర్ష్ దూబె అద్భుత‌మైన బంతితో అత‌డిని బోల్తా కొట్టించాల‌ని తెలిపాడు. ఇక త‌మ బౌల‌ర్లు అంద‌రూ ప్ర‌ణాళిక‌ల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా అమలు చేశార‌న్నాడు.

KKR vs SRH : సాకులు చెప్ప‌డం లేదు.. మేం ఓడిపోవ‌డానికి అస‌లు కార‌ణం అదే.. అజింక్యా ర‌హానే కామెంట్స్..

ప్ర‌తి మ్యాచ్ నుంచి తాము ఎన్నో అంశాల‌ను నేర్చుకుంటామ‌న్నాడు. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో తాము ఇంకాస్త మెరుగుప‌డాల్సి ఉంద‌న్నాడు. ఎక్స్‌ట్రాల రూపంలో 20కి పైగా ప‌రుగులు ఇవ్వ‌డం స‌రికాద‌న్నాడు. ఓ టీ20 మ్యాచ్‌లో 20 లేదా 10 ప‌రుగులు కూడా పెద్ద ముప్పుగా మారుతుంద‌న్నాడు. కాబ‌ట్టి ఫీల్డింగ్‌ను మెరుగుప‌ర‌చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నాడు.