Jasprit Bumrah : ముంబై కెప్టెన్‌గా తొలి విజయం తరువాత బుమ్రా కీలక వ్యాఖ్యలు.. ఇక మిగిలింది వన్డేల్లోనే.. జోకులు పక్కన బెడితే..
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah ) విజయాన్ని అందుకున్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 15, 2026 / 10:02 AM IST
Jasprit Bumrah key comments after first match win as a mi captian (pic credit@ipl)
- ముంబై కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే విజయం
- సంతోషాన్ని వ్యక్తం చేసిన బుమ్రా
- కీలక వ్యాఖ్యలు..
Jasprit Bumrah : ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే జస్‌ప్రీత్ బుమ్రా విజయాన్ని అందుకున్నాడు. గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లు దూరం కావడంతో బుమ్రా నాయకత్వం వహించాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం బుమ్రా మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉందన్నాడు. ఇది అద్భుతమైన మ్యాచ్ అని చెప్పుకొచ్చాడు.
రెండు జట్లు మంచి క్రికెట్ ఆడాయని తెలిపాడు. పంజాబ్‌కు మంచి ఆరంభం లభించిందని, అయినప్పటికి కూడా తాము అద్భుతంగా పుంజుకున్నామని తెలిపాడు. అయితే.. ఆఖరిలో కొన్ని క్యాచ్‌లు మిస్ చేయడం నష్టం చేకూర్చిందని అన్నాడు. ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం మరింత కష్టంగా మారినట్లుందని నవ్వుతూ అన్నాడు.
ఈ మైదానంలో జరిగిన గత మ్యాచ్ ఆధారంగా కొన్ని ప్రణాళికలను వేసుకున్నామని, అయితే.. పిచ్‌లో మునపటి కన్నా కాస్త వేగం ఎక్కువగా ఉందన్నాడు. తాము బౌలింగ్ చేసే సమయంలో బంతి కాస్త ఆగుతూ, తక్కువ ఎత్తులో వచ్చిందన్నాడు. దాన్ని చూసిన తరువాత పిచ్ గత మ్యాచ్‌లోలాగా లేదని అర్థమైందన్నాడు. వెంటనే ప్రణాళికలను మార్చుకున్నామన్నాడు. పేస్ తగ్గించి, క్రాస్ సీమ్‌తో స్టంప్స్ లక్ష్యంగా బంతులు వేసినట్లు చెప్పుకొచ్చాడు. బౌలర్లందరికి క్రెడిట్ దక్కుతుందన్నాడు. వారు ప్రణాళికలను చాలా చక్కగా అమలు చేశారన్నాడు.
శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ చేసిన విధానం, తిలక్ వర్మ ఇన్నింగ్స్‌లు మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్లుగా బుమ్రా చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విజయంలో వీరిద్దరికి సమాన క్రెడిట్ దక్కుతుందన్నాడు. ఒత్తిడిని తట్టుకుంటూ సహనంతో తిలక్ ఆడిన విధానం అద్భుతం అని అన్నాడు. అతడు మ్యాచ్‌ను ముగించడం బాగుందన్నాడు. ఆఖరిలో విల్ జాక్స్ అందించిన సహకారం చిన్నదే అయినప్పటికి కూడా టీ20ల్లో అది చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుందన్నాడు.
ఇక ముంబై కెప్టెన్‌గా చేయడంపై మాట్లాడుతూ.. తాను భారత్ తరుపున టెస్టులు, టీ20లకు కెప్టెన్‌గా వ్యవహరించానని చెప్పాడు. ఇక మిగిలింది వన్డే మ్యాచ్‌ల్లోనేనని అన్నాడు. అయితే.. అది జరుగుతుందని తాను అనుకోవడం లేదన్నాడు. జోకులు కాస్త పక్కన బెడితే.. ముంబైకి కెప్టెన్‌గా చేయడం సంతోషంగా ఉందన్నాడు. ఈ సమయాన్ని ఎంతో చక్కగా ఆస్వాదించినట్లుగా చెప్పుకొచ్చాడు.
