TeamIndia Vs Bangladesh : టీమిండియా బంగ్లాదేశ్ టూర్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ.. బీసీసీఐ ఏం చెప్పిందంటే?
TeamIndia Vs Bangladesh : భారత్ క్రికెట్ జట్టు ప్రతిపాదిత బంగ్లాదేశ్ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
TeamIndia Vs Bangladesh
TeamIndia Vs Bangladesh : భారత్ క్రికెట్ జట్టు ప్రతిపాదిత బంగ్లాదేశ్ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై గత కొంతకాలంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ పర్యటన విషయంలో బీసీసీఐ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
Also Read : Team India : భారత ఆటగాళ్లకు గాయాలు.. సంజీవ్ గోయెంకా, కావ్య మారన్ వంటి ఐపీఎల్ యజమానులపై భారీ ఆరోపణలు..
వాస్తవానికి గతేడాది భారత జట్టు బంగ్లాదేశ్ లో పర్యటించాల్సి ఉంది. కానీ, బిజీ షెడ్యూల్ కారణంగా ఆ పర్యటన ఈ ఏడాదికి వాయిదా వేశారు. ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 15 వరకు టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం బంగ్లాదేశ్ షెడ్యూల్ విండోను కేటాయించింది. ఇందులో సెప్టెంబరులో 1, 3, 6 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 9, 12, 13 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది.
బీసీసీఐకి ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేఖ రాసినట్లు.. ఈ లేఖలో బంగ్లాదేశ్ టూర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే, బంగ్లాదేశ్ పర్యటన విషయంలో బీసీసీఐ ఆచితూచి అడుగులు వేస్తోంది. దీంతో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తరువాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు తేల్చిచెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి బీసీసీఐ లేఖ కూడా రాసినట్లు తెలిసింది. ప్రభుత్వ మార్గదర్శకతను తీసుకుని పర్యటనపై తుది నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.
ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ మధ్య సరియైన సంబంధాలు లేవు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా వెళ్లేందుకు అనుమతి ఇస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్తుందా? లేదా? అనే అంశంపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
