MI vs CSK : చీటింగ్ చేసిన ముంబై..! శాంట్నర్ బదులు శార్దూల్.. వివరణ ఇచ్చిన జయవర్ధనే..
గురువారం వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI vs CSK) ఏకంగా 103 పరుగుల తేడాతో ఓడిపోయింది.
- Thota Vamshi Kumar
- Updated on- April 24, 2026 / 10:59 AM IST
IPL 2026 MI vs CSK concussion substitution controversy after replacing Mitchell Santner with Shardul Thakur
- చెన్నైతో మ్యాచ్‌లో క్యాచ్ అందుకునే క్రమంలో గాయపడిన మిచెల్ శాంట్నర్
- అతడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్ గా బ్యాటింగ్ చేసిన శార్దూల్ ఠాకూర్
- భుజానికి గాయమైతే కంకషన్ సబ్‌స్టిట్యూట్ కు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నిస్తున్న నెటిజన్లు
- వివరణ ఇచ్చిన ముంబై హెడ్ కోచ్ జయవర్ధనే
MI vs CSK : ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేస్తోంది. గురువారం వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 103 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది ఏడో ఓటమి. ఈ క్రమంలో ముంబై పై ప్రస్తుతం విమర్శల జడివాన కురుస్తోంది. అదే సమయంలో గురువారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ఆల్ రౌండర్ మిచెల్ శాంట్నర్ విషయంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్ నియమాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణల నేపథ్యంలో వివాదం చెలరేగింది.
ఈ మ్యాచ్‌లో చెన్నై ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో ఈఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను జస్‌ప్రీత్ బుమ్రా వేశాడు. ఈ ఓవర్‌లోని సీఎస్‌కే ఐదో బంతికి సీఎస్‌కే బ్యాటర్ కార్తిక్ శర్మ భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్ వద్ద న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ క్యాచ్‌ను పట్టుకునే క్రమంలో అతడు భుజానికి బలమైన గాయమైంది.
ఈ క్రమంలో అతడు నొప్పితో విలవిలలాడాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడు మైదానాన్ని వీడాడు. ఇక అతడు బ్యాటింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో అతడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్ గా శార్దూల్ ఠాకూర్‌ను తీసుకున్నారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనల ప్రకారం.. తల, మెడ వంటి సున్నిత భాగాల్లో గాయమై, మగతగా అనిపించిన సమయంలోనే కంకషన్ సబ్‌స్టిట్యూట్ ను అనుమతిస్తారు. ఈ సమయంలో మ్యాచ్ రిఫరీ కంకషన్ సబ్‌స్టిట్యూట్ ను ఆమోదించే ముందే గాయం తీవ్రతను నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది.
కాగా.. మిచెల్ శాంట్నర్ భుజానికి గాయమైతే కంకషన్ సబ్‌స్టిట్యూట్ ను ఎలా అనుమతిస్తారు ? శాంట్నర్ భుజంలో మెదడు ఉందా? ఏమిటి అన్న ప్రశ్నలు వేస్తున్నారు. ముంబై చీటింగ్ చేసిందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Excellently judged 👌
Mitchell Santner with a fine diving catch in the deep 👏👏
1⃣st wicket of the night for Jasprit Bumrah ☝️
Updates ▶️ https://t.co/gGt34dqUoq#TATAIPL | #KhelBindaas | #MIvCSK | @mipaltan pic.twitter.com/5EyRNf9kCb
— IndianPremierLeague (@IPL) April 23, 2026
దీనిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే స్పందించాడు. ‘శాంట్నర్ కు తొలుత తలకు, మెడకు గాయమైంది. సహజంగానే భుజానికి దెబ్బ తగిలింది. అతడిని స్కానింగ్ కు పంపించాము. తిరిగి వచ్చాక అతడు మగతగా ఉందని చెప్పాడు. అతడు బ్యాటింగ్ చేసే స్థితిలో లేడు. ఈ క్రమంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్ కోసం అనుమతి కోరాము. మిచెల్ బ్యాటింగ్, శార్దూల్ బ్యాటింగ్‌కు సరిపోతుందని భావించి అంపైర్లు, మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు.’ అని జయవర్ధనే తెలిపాడు.
ఇక శార్దూల్ ఠాకూర్ కూడా ముంబైని కాపాడలేకపోయాడు. 12 బంతులు ఆడిన అతడు కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు.
