Sanju Samson : వాంఖ‌డేలో సెంచ‌రీ.. ఎంతో గొప్ప‌గా అనిపిస్తుంది.. నిజంగా ఇది .. సంజూ శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

వాంఖ‌డేలో ముంబై ఇండియ‌న్స్ పై సెంచ‌రీ చేయ‌డం చాలా గొప్ప‌గా అనిపిస్తోంద‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓపెన‌ర్ సంజూ శాంస‌న్ (Sanju Samson) తెలిపాడు

IPL 2026 MI vs CSK Samson comments after received PLAYER OF THE MATCH award (pic credit@ipl)

  • వాంఖ‌డే ముంబై పై సెంచ‌రీ చేసిన సంజూ శాంస‌న్‌
  • ఈ సీజ‌న్‌లో రెండో శ‌త‌కం
  • ప్లేయ‌ప్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కైవ‌సం

Sanju Samson : వాంఖ‌డేలో ముంబై ఇండియ‌న్స్ పై సెంచ‌రీ చేయ‌డం చాలా గొప్ప‌గా అనిపిస్తోంద‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓపెన‌ర్ సంజూ శాంస‌న్ తెలిపాడు. త‌న జీవితంలో వాంఖేడేలో ఇంత ఎక్కువగా పసుపు రంగును ఎప్పుడూ చూసి ఉండనని చెప్పుకొచ్చాడు. జ‌ట్టు కోస‌మే ఆడాన‌ని, మ‌రే విష‌యాల‌ను ప‌ట్టించుకోలేద‌న్నాడు.

గురువారం వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్. చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 207 ప‌రుగులు చేసింది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో సంజూ శాంస‌న్ (101; 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) శ‌త‌కంతో చెల‌రేగాడు. రుతురాజ్ గైక్వాడ్ (22), డెవాల్డ్ బ్రెవిస్ (21)లు ప‌ర్వాదేద‌నిపించాడు. ముంబై బౌల‌ర్ల‌లో ఘజన్‌ఫర్, అశ్వని కుమార్ లు చెరో రెండు, జ‌స్‌ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్న‌ర్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

అనంత‌రం 208 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో ముంబై 19 ఓవ‌ర్ల‌లో 104 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ముంబై బ్యాట‌ర్ల‌లో తిల‌క్ వ‌ర్మ (37), సూర్య‌కుమార్ యాద‌వ్ (36) రాణించారు. మిగిలిన వారు ఘోరంగా విఫ‌లం కావ‌డంతో 103 ప‌రుగుల తేడాతో ఓట‌మి త‌ప్ప‌లేదు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో అకేల్ హోసేన్ నాలుగు, నూర్ అహ్మ‌ద్ రెండు వికెట్లు తీశాడు. ముకేశ్ చౌద‌రి, అన్షుల్ కాంబోజ్, జామీ ఓవర్టన్, గుర్జప్నీత్ సింగ్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.

చాలా గొప్పగా అనిపిస్తుంది

సెంచ‌రీతో చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు సంజూ శాంస‌న్. ఈ క్ర‌మంలో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ను సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న అనంత‌రం మాట్లాడుతూ.. వాంఖేడేలో ముంబై ఇండియన్స్‌పై సెంచరీ చేయడం చాలా గొప్పగా అనిపిస్తోందన్నాడు. ఇది నిజంగా త‌న‌తో పాటు జట్టుకు కచ్చితంగా ఒక ప్రత్యేకమైన క్షణమ‌న్నాడు. వాస్త‌వం చెప్పాలంటే తాను పెద్ద‌గా ఏ విష‌యాల‌ను మ‌న‌సుకు తీసుకోవ‌డం లేద‌న్నాడు. కేవ‌లం ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తూ ఆడేస్తున్నాన‌ని చెప్పుకొచ్చాడు.

ఈ రోజును పిచ్ ను ప‌రిశీలిస్తే.. ఇది సాధారణంగా వాంఖ‌డేలో ఉండే పిచ్ కాద‌ని అర్థ‌మైంద‌న్నాడు. బంతి స్వింగ్ అవుతూ ఆగుతూ వ‌స్తోంద‌న్నాడు. ప‌వ‌ర్ ప్లే తరువాత వ‌రుస‌గా తాము వికెట్లు కోల్పోతున్నామ‌న్నాడు. ఈ క్ర‌మంలో సెట్ అయిన తాను చివ‌రి వ‌ర‌కు క్రీజులో నిలబ‌డాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని అన్నాడు. ఫ‌లితం వ‌చ్చినందుకు చాలా ఆనందంగా ఉంద‌న్నాడు.

MI vs CSK : ఓట‌మికి సాకులు చెప్ప‌డం లేదు.. నిజంగా మా కొంప‌ముంచింది అదే.. హార్దిక్ పాండ్యా కామెంట్స్‌..

మ‌నం ఎలా ఆడాలి, ఏం చేయాలి అనే విష‌యాల‌ను ఆటే మ‌న‌కు చెబుతుంద‌న్నాడు. ముందుగానే ఇలా ఆడాలి, అలా ఆడాలి అని ఊహించుకుని మైదానంలోకి రావొద్ద‌న్నాడు. జ‌ట్టుకే త‌న మొద‌టి ప్రాధాన్య‌త అని చెప్పుకొచ్చాడు. త‌మ‌ది యువ జ‌ట్టు అనే విష‌యం అంద‌రికి తెలుసున‌ని అన్నాడు. మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టికి కూడా జ‌ట్టులోని యువ ఆటగాళ్లు కనబరిచిన వైఖరి, పట్టుదల నిజంగా ప్రశంసనీయమ‌న్నాడు. ఇక ఇదేను కొన‌సాగించాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పాడు.

ఇక నుంచి ప్ర‌తి మ్యాచ్ ఎంతో ముఖ్య‌మ‌న్న విష‌యం త‌మ‌కు తెలుసున‌న్నాడు. తాము సిద్ధంగా ఉన్నామ‌న్నాడు. వాంఖ‌డేలో ఇంతలా ప‌సుపు రంగు జెర్సీలు క‌నిపిస్తుండ‌డం చాలా బాగుంద‌న్నాడు. ఇక ఈ ఫ్రాంఛైజీ త‌రుపున ఆడటానికి తాను చాలా కృతజ్ఞుడను అని సంజూ శాంస‌న్ అన్నాడు.