Virat Kohli : విరాట్ కోహ్లీ గాయంపై ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కామెంట్స్.. నిజం చెప్పాలంటే..
బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన కోహ్లీ(Virat Kohli) ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సందర్భంగా ఫీల్డింగ్‌కు రాలేదు.
- Thota Vamshi Kumar
- Published On : April 13, 2026 / 07:57 AM IST
IPL 2026 MI vs RCB Rajat Patidar comments on Virat Kohli injury (pic credit@ipl)
- ముంబై ఇన్నింగ్స్ సందర్భంగా ఫీల్డింగ్‌కు రాని విరాట్ కోహ్లీ
- ఆందోళనలో అభిమానులు
- కోహ్లీ గాయం పై స్పష్టత ఇచ్చిన రజత్ పాటిదార్
Virat Kohli : ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మళ్లీ విజయాల బాట పట్టింది. ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై 18 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీకి ఇది మూడో విజయం. ఆర్‌సీబీ గెలుపొందినప్పటికి కూడా అందరి దృష్టి కోహ్లీపైనే ఉంది. బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన కోహ్లీ(Virat Kohli).. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సందర్భంగా ఫీల్డింగ్‌కు రాలేదు. డగౌట్‌లో కూర్చోని కనిపించాడు. దీంతో అతడికి ఏమైందోనని ఫ్యాన్స్ అంతా ఆందోళన చెందుతున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 240 పరుగు చేసింది. ఆర్‌సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ (78; 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు), రజత్ పాటిదార్ (53; 20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడగా.. విరాట్ కోహ్లీ (50; 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ (34 నాటౌట్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు)లు రాణించారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (71; 31 బంతుల్లో 1 ఫోర్, 9 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ చేయగా, హార్దిక్ పాండ్యా (40; 22 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించినప్పటికి కూడా మిగిలిన వారు విఫలం కావడంతో 241 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 222 పరుగులకే పరిమితమైంది. ఆర్‌సీబీ బౌలర్లలో సుయాష్ శర్మ రెండు వికెట్లు తీశాడు. జాకబ్ డఫీ, రసిఖ్ సలాం దార్, కృనాల్ పాండ్యా లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ముంబై పై విజయం సాధించడం తనకు ఎల్లప్పుడూ ప్రత్యేకమైన అనుభూతి అని చెప్పుకొచ్చాడు. జట్టులోని ప్రతి ఆటగాడికి తమ తమ బాధ్యతల పట్ల పూర్తి అవగాహన ఉందన్నాడు. ఓపెనర్లు కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఇన్నింగ్స్ ఆరంభించిన తీరు మ్యాచ్‌లో తమను ఆధిపత్యం చెలయించేలా చేసిందన్నాడు. ఆ తరువాత తాను, టిమ్ డేవిడ్‌లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడామని చెప్పాడు. మొత్తంగా ఇది సమిష్టి విజయం అని తెలిపాడు. ఇక అందరూ తనకు స్పిన్ ఆడడం అంటే ఎంతో ఇష్టం అని అనుకుంటారని, వాస్తవం చెప్పాలంటే తనకు పేస్ బౌలింగ్ ఆడడం అంటే ఎంతో మక్కువ అని అన్నాడు.
కోహ్లీ కి గాయం..
ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లోని పదవ ఓవర్‌లో ఐదు బంతుల తర్వాత కోహ్లీ తన ఎడమ కాలికి చికిత్స తీసుకుంటూ కనిపించాడు. అప్పుడు కోహ్లీ 25 బంతుల్లో 35 పరుగులతో ఆడుతున్నాడు. చివరికి అతడు 38 బంతుల్లో 50 పరుగులు చేసి హార్దిక్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. కోహ్లీ చీలమండల గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు ఫీల్డింగ్‌కు రాలేదని సమాచారం. ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే అతడిని ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ మైదానానికి దూరంగా ఉంచారు. గాయం తీవ్రతపై ఇప్పటి వరకు మేనేజ్‌మెంట్ స్పష్టత ఇవ్వనప్పటికి కూడా ఇది సుదీర్ఘమైన టోర్నమెంట్ కావడంతో కోహ్లీ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడని ఫ్రాంచైజీ బావించినట్లు అర్థమవుతోంది.
ALSO READ : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ముంబై పై ఒకే ఒక ఆటగాడు..
RCB WON THEIR LAST 6 GAMES OUT OF THE LAST 8 AGAINST MUMBAI INDIANS.
– The meet-up of legends, Virat Kohli hugging Sachin Tendulkar. 🥹❤️ pic.twitter.com/SrbfmDwDjs
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 12, 2026
ఇక కోహ్లీ గాయం పై ప్రెజెంటేషన్ సమయంలో ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ స్పందించాడు. తనకు ఈ విషయం పై పూర్తి స్పష్టత లేదన్నాడు. అయితే.. ప్రస్తుతానికి కోహ్లీ బాగానే ఉన్నాడని తనకు అనిపిస్తోందన్నాడు.
