Pat Cummins : పంజాబ్ పై విజ‌యం.. ట్రావిస్ హెడ్ నిద్ర‌.. పాట్ క‌మిన్స్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

పంజాబ్ పై గెల‌వ‌డం ప‌ట్ల స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ (Pat Cummins) ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు.

IPL 2026 Pat Cummins comments after SRH beat against PBKS (pic credit@ipl)

  • పంజాబ్ పై విజ‌యం సాధించిన స‌న్‌రైజ‌ర్స్
  • పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానం
  • పాట్ క‌మిన్స్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Pat Cummins : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అద‌ర‌గొడుతోంది. బుధ‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పై విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలోకి దూసుకువెళ్లింది. ఈ క్ర‌మంలో ప్లేఆఫ్స్‌కు మ‌రింత చేరువైంది. ఇక పంజాబ్ పై గెల‌వ‌డం ప‌ట్ల స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు.

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 235 ప‌రుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో హెన్రిచ్ క్లాసెన్ (43 బంతుల్లో 69 ప‌రుగులు), ఇషాన్ కిష‌న్ (32 బంతుల్లో 55 ప‌రుగులు) అర్థ‌శత‌కాలు చేశారు. అభిషేక్ శ‌ర్మ (13 బంతుల్లో 35 ప‌రుగులు), ట్రావిస్ హెడ్ (19 బంతుల్లో 38 ప‌రుగులు) రాణించారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్‌, ఫెర్గూస‌న్‌, చ‌హ‌ల్, విజ‌య్‌కుమార్ వైశాక్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.

IPL 2026 Playoffs Schedule : ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుద‌ల చేసిన బీసీసీఐ.. బెంగ‌ళూరుకు షాక్‌.. ఫైన‌ల్ మ్యాచ్ ఎక్క‌డంటే?

అనంత‌రం 236 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో పంజాబ్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 202 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో 33 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో కూపర్ కొన్నోలీ (107 నాటౌట్; 59 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) శ‌త‌క్కొట్టాడు. ఎస్ఆర్‌హెచ్‌ బౌల‌ర్ల‌లో పాట్ క‌మిన్స్, శివంగ్ కుమార్ చెరో రెండు వికెట్లు తీయ‌గా.. నితీశ్ కుమార్ రెడ్డి, మ‌లింగ‌, సాకిబ్ హుస్సేన్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.

ఆత్మ‌విశ్వాసం రెట్టింపు..

ఇక స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన కెప్టెన్ పాట్ క‌మిన్స్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అనంత‌రం అత‌డు మాట్లాడుతూ పంజాబ్ పై విజ‌యం సాధించ‌డం సంతోషాన్ని ఇచ్చింద‌న్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో ఉన్న పంజాబ్‌ను ఓడించ‌డంతో త‌మ ఆత్మ‌విశ్వాసం రెట్టింపు అయింద‌న్నాడు. బ్యాట‌ర్లు విజృంభించ‌డంతోనే విజ‌యానికి పునాది ప‌డింద‌ని చెప్పుకొచ్చాడు.

తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్లు చేయ‌డం పై క‌మిన్స్ మాట్లాడుతూ.. నెమ్మ‌దిగా ఆరంభాల‌నే అనే మాటే త‌మ జ‌ట్టులో ఉండ‌ద‌న్నారు. ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్‌, అభిషేక్ శ‌ర్మ క్రీజులోకి వ‌చ్చిన వెంట‌నే తొలి బంతి నుంచే బాదుడు మొద‌లుపెడ‌తార‌న్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఇన్ని ప‌రుగులు చేయాల‌నే టార్గెట్ ఏమీ పెట్టుకోమ‌న్నాడు. సాధ్య‌మైన‌న్నీ ఎక్కువ ప‌రుగులు చేసేందుకే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని తెలిపాడు. ఒక‌వేళ వికెట్లు కోల్పోతే అందుకు అనుగుణంగా సర్దు బాటు చేసుకుంటామ‌ని చెప్పుకొచ్చాడు.

ఉప్ప‌ల్ స్టేడియం త‌మ‌కు సొంత స్టేడియం అని, గ‌త రెండేళ్లుగా ఇక్క‌డ అన్ని మ్యాచ్‌ల్లో రాణిస్తున్నామ‌న్నాడు. త‌మ బ్యాటింగ్ శైలికి స‌రిగ్గా స‌రిపోతుంద‌న్నాడు. ఇక్క‌డ రాత్రి వేళ్ల‌లో బాల్ కాస్త ఆగుతూ వ‌స్తుంద‌న్నాడు. ఇది స్లో బౌల‌ర్లు, స్పిన్న‌ర్ల‌కు క‌లిసి వ‌చ్చే అంశం అని అన్నాడు. ఇక ఇక్క‌డ మ‌ధ్యాహ్నం జ‌రిగే మ్యాచ్‌ల్లో ఎందుకు ఇబ్బంది ప‌డుతున్నారు అనే ప్ర‌శ్న‌పై మాట్లాడుతూ.. సాధారణంగా అత‌డి పిల్లలు ఇక్కడ లేనప్పుడు ఆ సమయానికి ట్రావిస్ హెడ్ నిద్ర‌పోతూ ఉంటాడు. అందుకేనేమో మధ్యాహ్నం ఆటలలో అంత ఇబ్బంది ప‌డుతున్నామేమో?  అని క‌మిన్స్ న‌వ్వుతూ అన్నాడు.

Shreyas Iyer : ఓట‌మికి గ‌ల ప్ర‌ధాన‌ కార‌ణాలు వెల్ల‌డించిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. ఆ ఒక్క త‌ప్పు వ‌ల్లే మేం ఓడిపోయాం..

ఇక తాను బౌలింగ్ చేసిన తీరుతో సంతోషంగా ఉన్న‌ట్లు చెప్పుకొచ్చాడు. అయితే.. త‌న‌కు ఈ అవార్డు ఎలా వ‌చ్చిందో ఇప్ప‌టికి అర్థం కావ‌డం లేద‌న్నాడు. ఏదీఏమైన‌ప్ప‌టికి కూడా జ‌ట్టు విజ‌యంలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంద‌న్నాడు. ఈ మ్యాచ్‌లో సెంచ‌రీ చేసిన కూప‌ర్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. అత‌డు అద్భుత‌మైన ఆట‌గాడు అని కితాబు ఇచ్చాడు.

ఇక పాయింట్ల ప‌ట్టిక‌లో నంబ‌ర్ వ‌న్ స్థానం ద‌క్క‌డంపై ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. ప్ర‌స్తుతం ఓ చిన్న విరామం దొరికింద‌ని, టాప్ పొజిష‌న్‌లో ఉండ‌డాన్ని ఎంజాయ్ చేస్తామ‌న్నాడు. ఇక ఈ సీజ‌న్‌లో త‌ప్ప‌కుండా త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌న్నాడు.