Kieron Pollard fined : పంజాబ్ పై విజయం.. ముంబైకి బిగ్ షాక్ ఇచ్చిన ఐపీఎల్ నిర్వాహకులు.. 15 శాతం జరిమానా
ముంబై బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్‌కు (Kieron Pollard fined) భారీ జరిమానా విధించారు.
- Thota Vamshi Kumar
- Updated on- May 15, 2026 / 10:41 AM IST
IPL 2026 PBKS vs MI Kieron Pollard fined 15 percent of his match fee (pic credit@ipl)
- గెలుపు జోష్‌లో ఉన్న ముంబైకి షాక్
- బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ కు జరిమానా
- మ్యాచ్ ఫీజులో 15 శాతం ఫైన్, ఓ డీమెరిట్ పాయింట్
Kieron Pollard fined : గురువారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించి మంచి జోష్‌లో ఉన్న ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ నిర్వాహకులు షాక్ ఇచ్చారు. ముంబై బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్‌కు భారీ జరిమానా విధించారు. మ్యాచ్ సమయంలో మ్యాచ్ అధికారులతో వాగ్వాదం చేసినందుకు గాను అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానాగా విధించారు. అంతేకాదండోయ్ అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చారు.
ఐపీఎల్ నిర్వాహకులు తెలిపిన దాని ప్రకారం రెండో ఇన్నింగ్స్ 19 ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ఫోర్త్ అంఫైర్‌ను ఉద్దేశించి అసభ్య పదజాలం ఉపయోగించినందుకు పొలార్డ్ ను దోషిగా తేల్చారు. అయితే.. పొలార్డ్ ఎందుకు ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదం పెట్టుకున్నాడు అన్న సంగతి తెలియరాలేదు.
‘ఐపీఎల్ ఆటగాళ్లు, జట్టు అధికారుల ప్రవర్తనా నియమావళిలోని లెవెల్ 1ను ఉల్లంఘించినందుకు గానూ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్‌కు అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానాగా విధించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ ను అతడి ఖాతాలో చేర్చాం. మ్యాచ్ సమయంలో వినపడేలా అసభ్య పదజాలం వాడటంకు సంబంధించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3ను పొలార్డ్ ఉల్లంఘించినట్లు తేలింది. రెండో ఇన్నింగ్స్‌లోని 19వ ఓవర్‌లో నాల్గవ అంపైర్‌ను ఉద్దేశించి పొలార్డ్ దుర్భాషలాడినప్పుడు ఈ సంఘటన జరిగింది. పొలార్డ్ తన తప్పును అంగీకరించి, మ్యాచ్ రిఫరీ పంకజ్ ధర్మాని విధించిన శిక్షను స్వీకరించారు.’ అని ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (32 బంతుల్లో 57 పరుగులు), అజ్మతుల్లా ఒమర్జాయ్ (17 బంతుల్లో 38 పరుగులు) రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు, దీపక్ చాహర్ రెండు, కార్బిన్ బోష్, రాజ్ బవా చెరో వికెట్ తీశారు.
అనంతరం 201 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19.5 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి ఛేదించింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ (33 బంతుల్లో 75 నాటౌట్), ర్యాన్ రికెల్టన్ (23 బంతుల్లో 48 పరుగులు), విల్ జాక్స్ (10 బంతుల్లో 25 నాటౌట్ ) రాణించారు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు, మార్కో జాన్సెన్, చహల్‌లు చెరో వికెట్ తీశారు.
