IPL 2026 Playoff Qualification Scenarios: ఐపీఎల్ ప్లే ఆఫ్స్ సమీకరణాలు.. తొలి జట్టుగా అడుగుపెట్టిన ఆర్‌సీబీ.. మిగిలిన 3 స్థానాల కోసం 7 జట్ల మధ్య పోటీ.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్లేఆఫ్స్ సమరం (IPL 2026 playoff qualification scenarios )మరింత రసవత్తరంగా మారింది.
- Thota Vamshi Kumar
- Updated on- May 18, 2026 / 10:39 AM IST
IPL 2026 Playoff Qualification Scenarios
IPL 2026 Playoff Qualification Scenarios : ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్లేఆఫ్స్ సమరం మరింత రసవత్తరంగా మారింది. ఆదివారం పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అధికారికంగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. మరోవైపు రాజస్థాన్‌ను ఓడించి ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్ రేసును ఆసక్తికరంగా మార్చింది.
ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరుకున్న తొలి జట్టుగా ఆర్‌సీబీ నిలిచింది. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించగా మిగిలిన మూడు స్థానాల కోసం ఏడు జట్ల మధ్య పోటీ నెలకొంది. ఏ జట్టు అవకాశాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం..
GT గుజరాత్ టైటాన్స్..
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు గుజరాత్ 13 మ్యాచ్‌లు ఆడింది. 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా మరో 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 16 పాయింట్లు ఖాతాలో ఉండగా నెట్‌రన్‌రేటు +0.400గా ఉంది. లీగ్ దశలో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే 18 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంటుంది. అంతేకాకుండా పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచేందుకు అవకాశం ఉంటుంది. చివరి మ్యాచ్‌ను సీఎస్‌కే ఆడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే.. అప్పుడు సీఎస్‌కే, ఆర్ఆర్ లేదా ఎస్ఆర్‌హెచ్ జట్లలో ఏదో ఒక జట్టు 16 కంటే తక్కువ పాయింట్లు సాధిస్తే ముందంజ వేస్తుంది.
SRH (సన్‌రైజర్స్ హైదరాబాద్)..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడింది. 14 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. లీగ్ దశలో రెండు మ్యాచ్‌లు సీఎస్‌కే, ఆర్‌సీబీతో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లోనే గెలిచినా కూడా ప్లేఆఫ్స్‌కు అవకాశం ఉంటుంది. అయితే.. అది మిగిలిన జట్ల సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే.. పరిస్థితులు సంక్లిష్టం అవుతాయి.
PBKS (పంజాబ్ కింగ్స్)..
ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడి 13 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. చివరి మ్యాచ్‌లో లక్నోతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. అదే సమయంలో సీఎస్‌కే, ఆర్ఆర్ లేదా ఎస్‌ఆర్‌హెచ్‌లలో ఏదో ఒకటి మాత్రమే 15 పాయింట్లు దాటాలి. మిగిలినవి అంతకంటే తక్కువకే పరిమితం కావాలి. అప్పుడే పంజాబ్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతోంది. అయితే.. చివరిగా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో పంజాబ్ ఓడిపోవడం గమనార్హం.
RR (రాజస్థాన్ రాయల్స్)..
ఇప్పటి వరకు రాజస్థాన్ 12 మ్యాచ్‌లు ఆడింది. 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. లీగ్ దశలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంది. అయితే.. ఇందుకు మిగిలిన జట్ల సమీకరణాలు కలిసి రావాల్సి ఉంది. అంటే సీఎస్‌కే మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిచి, ఆర్‌సీబీని ఎస్ఆర్‌హెచ్ ఓడించి, ఆ రెండు జట్లకు కంటే ఆర్ఆర్ నెట్ రన్‌రేటు మెరుగ్గా ఉండాల్సి ఉంటుంది.
CSK (చెన్నై సూపర్ కింగ్స్)..
చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడింది. 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే అప్పడు ప్లేఆఫ్స్ చేరుకునే ఛాన్స్ ఉంది. అదే సమయంలో మిగిలిన జట్ల సమీకరణాలు కలిసి రావాల్సి ఉంటుంది.
DC (ఢిల్లీ క్యాపిటల్స్)..
రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ 12 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. తమ చివరి మ్యాచ్‌ను కేకేఆర్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది. అయితే.. ఆఖరి మ్యాచ్‌లో గెలవడంతో పాటు మిగిలిన జట్ల సమీకరణాలు కలిసి రావాల్సి ఉంటుంది.
KKR (కోల్‌కతా నైట్ రైడర్స్)..
కోల్‌కతా నైట్‌రైడర్స్ పరిస్థితి కాస్త అగమ్యగోచరంగానే ఉంది. సాంకేతికంగా మాత్రమే ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసులో ఉంది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడగా 11 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన కూడా ఆ జట్టు ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. నెట్‌రన్‌రేటు మైనస్‌లో ఉంది. కాబట్టి చివరి రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో విజయం సాధించాలి. అదే సమయంలో చాలా సమీకరణాలు కలిసి వస్తేనే కేకేఆర్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.
