Rishabh Pant : ఈ రోజు కొత్త టాటూ వేయించుకున్నా.. పంజాబ్ పై ఓట‌మి అనంత‌రం రిష‌బ్ పంత్ కామెంట్స్ వైర‌ల్‌..

పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోవడంపై ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ (Rishabh Pant) స్పందించాడు.

IPL 2026 Rishabh Pant comments intresting comments after LSG lost match to PBKS (pic credit@ipl)

  • పంజాబ్ పై ల‌క్నో ఓట‌మి
  • రిష‌బ్ పంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
  • ఓడిపోయినా ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయ‌ని చెప్పుకొచ్చిన ల‌క్నో కెప్టెన్

Rishabh Pant : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ప్ర‌యాణం ఏమంత గొప్ప‌గా సాగ‌డం లేదు. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 54 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం చ‌విచూసింది. ఈ సీజ‌న్‌లో ల‌క్నోకు ఇది నాలుగో ఓట‌మి కాగా.. వ‌రుస‌గా మూడోది కావ‌డం గ‌మ‌నార్హం.

ప్రియాన్ష్ ఆర్య (93; 37 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స‌ర్లు), కూపర్ కొన్నోలీ (87; 46 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌లు ఆడ‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 254 ప‌రుగులు చేసింది. ల‌క్నో బౌల‌ర్ల‌లో ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్ లు చెరో రెండు వికెట్లు తీశారు. మోసిన్ ఖాన్, మ‌హ్మ‌ద్ ష‌మీలు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

అనంత‌రం మిచెల్ మార్ష్ (40; 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ఆయుష్ బ‌దోని (35; 21 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స‌ర్లు), రిష‌బ్ పంత్ (43; 23 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స‌ర్లు), ఐడెన్ మార్‌క్ర‌మ్ (42; 22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించిన‌ప్ప‌టికి మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో 255 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 200 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. పంజాబ్ బౌల‌ర్ల‌లో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్‌, విజ‌య్‌కుమార్ వైశాక్, యుజ్వేంద్ర చాహ‌ల్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

ఓడిపోయినా ఎన్నో సానుకూల అంశాలు

మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మిపై ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన‌ప్ప‌టికి కూడా ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయ‌ని చెప్పుకొచ్చాడు. త‌న ఎడ‌మ మోచేతి గాయం గురించి మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే మెరుగు అవుతోంద‌న్నాడు. అయితే.. ఈ రోజు తాను కుడి చేతికి ఓ కొత్త టాటూను వేయించుకున్నాను అని తెలిపాడు. కాబ‌ట్టి మ‌ళ్లీ ఏదో ఒక గాయం కొత్త‌గా ఎదురుచూస్తూనే ఉంటుంద‌ని న‌వ్వులు పూయించాడు.

ఈ మ్యాచ్‌లో త‌ప్పు ఎక్క‌డ జ‌రిగింది అనే విష‌యం చెప్ప‌డం క‌ష్టం అని తెలిపాడు. ఎందుకంటే బౌల‌ర్లు అద్భుంగా రాణిస్తున్నార‌ని తెలిపాడు. అయిన‌ప్ప‌టికి కూడా ఆందోళ‌న క‌లిగించే అంశాలు కూడా ఉన్నాయ‌న్నాడు. తాము కొన్ని విష‌యాల్లో ఇంకా మెరుగుప‌డాల్సి ఉంద‌న్నాడు. సానుకూల అంశాలను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే.. ఓ జ‌ట్టుగా ప్ర‌తి మ్యాచ్‌లోనూ తాము అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని తెలిపాడు.

ఆయుష్ బదోనిని ఓపెనర్‌గా పంప‌డం పై మాట్లాడుతూ.. అత‌డు స్వేచ్ఛగా మైదానంలోకి వెళ్లి ఆడాల‌నే ఉద్దేశ్యంతోనే ఓపెన‌ర్‌గా పంపిన‌ట్లు చెప్పుకొచ్చాడు. అయితే.. ఇది స‌డెన్‌గా తీసుకున్న నిర్ణ‌యం కాద‌న్నాడు. అత‌డితో ఓపెనింగ్ చేయించాల‌ని ముందే నిర్ణ‌యించుకున్న‌ట్లుగా తెలిపాడు. టాప్ ఆర్డ‌ర్‌లో కొంత స్వేచ్ఛ ఉండాల‌ని, అదే స‌మ‌యంలో మిడిల్ ఆర్డ‌ర్ కూడా త‌మ వంతు స‌హ‌కారం అందించాల‌ని తాము కోరుకున్నామ‌న్నాడు.

జ‌ట్టుపై త‌న‌కు పూర్తి న‌మ్మ‌కం ఉంద‌న్నాడు. పంజాబ్ కూడా అత్యుత్త‌మంగా ఆడింద‌ని, వారికి క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంద‌న్నాడు. ఏదీఏమైన‌ప్ప‌టికి కూడా తాము సానుకూలంగా ముందుకు సాగుతామ‌న్నాడు.