Chennai Super Kings : సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్‌తో పాటు ఆ జ‌ట్టు ఆట‌గాళ్ల‌కు భారీ జ‌రిమానా

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings) క‌థ ముగిసింది.

IPL 2026 Ruturaj Gaikwad has been fined after his team maintained a slow over rate against Gujarat Titans (pic credit@ipl)

  • గుజ‌రాత్ మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేటును న‌మోదు చేసిన సీఎస్‌కే
  • కెప్టెన్ రుతురాజ్‌తో పాటు మిగిలిన ఆట‌గాళ్ల‌కు జ‌రిమానా

Chennai Super Kings : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ క‌థ ముగిసింది. ప్లేఆఫ్స్ ఆశ‌లు సజీవంగా ఉండాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన త‌మ ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో ఓడిపోయింది. గురువారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 89 ప‌రుగుల తేడాతో ఓట‌మిని చ‌విచూసింది. ఈ సీజ‌న్‌లో సీఎస్‌కేకు ఇది 8వ ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం. ఓట‌మి బాధ‌లో ఉన్న సీఎస్‌కేకు ఐపీఎల్ నిర్వాహ‌కులు భారీ షాక్ ఇచ్చారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో పాటు జ‌ట్టు స‌భ్యులు అంద‌రికి జ‌రిమానా విధించారు.

సాయి సుద‌ర్శ‌న్ (84; 53 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), శుభ్‌మ‌న్ గిల్ (64; 37 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), జోస్ బ‌ట్ల‌ర్ (57 నాటౌట్; 27 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు విక‌ట్ల న‌ష్టానికి 229 ప‌రుగులు చేసింది. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో ముకేశ్ చౌద‌రి, స్పెన్సర్ జాన్సన్, అన్షుల్ కాంబోజ్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

అనంత‌రం 230 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో సీఎస్‌కే 13.4 ఓవ‌ర్ల‌లో 140 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో శివ‌మ్‌దూబె (47; 17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) రాణించాడు. గుజ‌రాత్ టైటాన్స్ బౌల‌ర్ల‌లో సిరాజ్‌, ర‌బాడ‌, ర‌షీద్ ఖాన్‌లు త‌లా మూడేసి వికెట్లు ప‌డ‌గొట్టారు.

సీఎస్‌కేకు భారీ షాక్..

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న సీఎస్‌కేకు భారీ షాక్ త‌గిలింది. గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో చెన్నై స్లో ఓవ‌ర్ రేటును న‌మోదు చేసింది. ఈ సీజ‌న్‌లో ఈ త‌ప్పిదానికి పాల్ప‌డ‌డం సీఎస్‌కేకు ఇది రెండో సారి. ఈ నేప‌థ్యంలో ఆ జ‌ట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు 24 ల‌క్ష‌ల జ‌రిమానా విధించారు. అంతేకాదండోయ్‌.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌తో స‌హా తుది జ‌ట్టులోని ఆట‌గాళ్ల‌కు ఆరు ల‌క్ష‌ల రూపాయ‌లు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం.. ఈ రెండింటిలో ఏదీ త‌క్కువ అయితే అది జ‌రిమానాగా విధించ‌బ‌డింది.

Rohit Sharma : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027 నుంచి రోహిత్ శ‌ర్మ ఔట్‌? హిట్‌మ్యాన్ భ‌విత‌వ్యంపై కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న బీసీసీఐ!

ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన 66వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్లో ఓవ‌ర్ రేటును న‌మోదు చేసినందుకు జరిమానా విధించాం. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని కనీస ఓవర్-రేట్ ఉల్లంఘనలకు సంబంధించిన ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఈ సీజన్‌లో అతని జట్టుకు ఇది రెండవ ఉల్లంఘన (మొదటిది 18వ మ్యాచ్‌లో). ఈ కారణంగా గైక్వాడ్‌కు 24 లక్షల రూపాయల జరిమానా విధించాం. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ప్లేయింగ్ ఎలెవన్‌లోని మిగిలిన సభ్యులకు ఆరు లక్షల రూపాయలు లేదా వారి వారి మ్యాచ్ ఫీజులలో 25 శాతం, ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది జరిమానాగా విధించబ‌డుతుంది. అని ఐపీఎల్ నిర్వాహ‌కులు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.