Rohit Sharma : వన్డే ప్రపంచకప్ 2027 నుంచి రోహిత్ శర్మ ఔట్? హిట్‌మ్యాన్ భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ!
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma) అంతర్జాతీయ క్రికెట్లో టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
BCCI May Take key Decision On Rohit Sharma Ahead Of ODI World Cup 2027 Report
- రోహిత్ శర్మ ఫిట్నెస్ పై దృష్టి సారించిన బీసీసీఐ
- వన్డే ప్రపంచకప్ 2027కి ముందు కీలక నిర్ణయం
- బ్యాకప్ ఓపెనర్లు సిద్ధం చేసే పనిలో సెలక్టర్లు
Rohit Sharma : టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడడమే తన లక్ష్యం అని ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 39 ఏళ్లు. వన్డే ప్రపంచకప్ 2027 జరిగే నాటికి అతడికి 41 ఏళ్లు నిండుతాయి. అయితే.. అతడు అప్పటి వరకు ఫిట్‌గా ఉంటాడా లేదా అనే దానిపై బీసీసీఐకి సందేహాలు ఉన్నట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి.
జూన్ నెలలో భారత జట్టు అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో రోహిత్ శర్మకు చోటు దక్కింది. అయితే.. ఈ సిరీస్‌లో అతడు ఆడతాడా? లేదా ? అనే విషయం అతడి ఫిట్నెస్ పైనే ఆధారపడి ఉంటుందని సెలక్టర్లు జట్టును ఎంపిక చేసిన సమయంలోనే చెప్పారు. హిట్‌మ్యాన్ ఫిట్నెస్ను నిరూపించుకుంటేనే ఆడతాడు అని స్పష్టంగా చెప్పేశారు.
ప్రస్తుతం రోహిత్ శర్మ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే.. అతడు కండరాల గాయంతో బాధపడుతున్నాడు. గాయం కారణంగా ఈ సీజన్లో పలు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. కొన్ని మ్యాచ్‌లల్లో అతడు ఫీల్డింగ్ చేయడం లేదు కేవలం బ్యాటర్‌గానే ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్ ఫిట్‌నెస్‌పై బీసీసీఐకి ఆందోళన నెలకొన్నట్లు చెబుతున్నారు.
‘ఆ మూడు వారాల పాటు రోహిత్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కి హాజరు కాలేదు. అతను సన్నబడ్డాడు కానీ, అత్యున్నత స్థాయి క్రీడల భారాన్ని అతని శరీరం తట్టుకోగలదా అనే ఆందోళనలు ఉన్నాయి. అతను 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఐపీఎల్లో ఉన్నట్లుగా వన్డే క్రికెట్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అనే ఆప్షన్ లేదు. 40 ఏళ్లకు దగ్గర పడుతున్నప్పుడు శరీరం కోలుకోవడానికి సమయం పడుతుంది.’ అని బీసీసీఐ వర్గాలు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.
యశస్వి జైస్వాల్లో పాటు అదనపు బ్యాకప్ ఓపెనర్లను కూడా సెలక్టర్లు సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్‌కు ముందు ఎక్కువ వన్డేలు లేవు. జైస్వాల్ పెద్దగా వన్డేలు ఆడలేదు. ఇషాన్ కిషన్ ఓపెనింగ్ కూడా చేయగలడు. ఒకవేళ రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోయినా, గిల్, జైస్వాల్ గాయపడినా మరో ఓపెనర్ సిద్ధంగా ఉండే విధంగా సెలక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం భారతదేశంలోని చాలా మంది క్రికెటర్ల కంటే కోహ్లీ ఫిట్నెస్, ఫామ్ మెరుగ్గా ఉన్నాయి. అయితే.. కోహ్లీ, రోహిత్‌లను ఇకపై ఒకేలా చూడలేమని అర్థం చేసుకోవాలి. బీసీసీఐ వైద్య బృందంతో సంప్రదించిన తర్వాత రోహిత్ విషయంలో ఒక గట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
