PBKS vs GT : అర్ష్‌దీప్ సింగ్ వచ్చి ఒక్కటే చెప్పాడు.. విజయం పై శ్రేయస్ అయ్యర్ హాట్ కామెంట్స్..
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS vs GT) విజయంతో బోణీ కొట్టింది.
- Thota Vamshi Kumar
- Published On : April 1, 2026 / 08:10 AM IST
IPL 2026 Shreyas Iyer comments after Punjab Kings win the match against Gujarat Titans
- విజయంతో బోణీ కొట్టిన పంజాబ్
- గుజరాత్ టైటాన్స్ పై 3 వికెట్ల తేడాతో గెలుపు
- పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్ వైరల్
PBKS vs GT : ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ విజయంతో బోణీ కొట్టింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపు పట్ల పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అజేయ అర్థశతకంతో పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన కూపర్ కానల్లీ పై ప్రశంసల వర్షం కురిపించాడు.
మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (39), జోస్ బట్లర్ (38) రాణించారు. పంజాబ్ బౌలర్లలో విజయకుమార్ వైశాఖ్ మూడు వికెట్లు పడగొట్టాడు. యుజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లు, మార్కో జాన్సెన్ ఓ వికెట్ తీశాడు.
PBKS vs GT : ఆ ఒక్క తప్పు వల్లే పంజాబ్ పై ఓడిపోయాం.. లేదంటేనా.. శుభ్‌మన్ గిల్ కామెంట్స్..
163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 19.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంజాబ్ బ్యాటర్లలో కూపర్ కానల్లీ (72 నాటౌట్; 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (37; 24 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు సాధించాడు. కగిసో రబాడ, అశోక్ శర్మ, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ లు తలా ఓ వికెట్ పడగొట్టాడు.
ఐపీఎల్‌లో ఇలాంటివి సహజం
మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ విజయం పై స్పందించాడు. తొలుత తన చేతి గాయం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం అంతా బాగానే ఉందన్నాడు. అజేయ అర్థశతకంతో రాణించిన కూపర్ కానల్లీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు అద్భుతంగా ఆడారని అన్నాడు. అతడు ఆడిన కొన్ని షాట్లు చూడడానికి అద్భుతంగా అనిపించాయన్నాడు. ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అతడు కొట్టిన షాట్లు అమోఘం అని అన్నాడు.
MI vs KKR : మ్యాచ్ జరుగుతుండగా ప్రియురాలికి ప్రపోజ్.. రింగ్ పోయింది.. కట్ చేస్తే..
ఓ దశలో పంజాబ్ 110/3 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే.. వరుసగా వికెట్లు కోల్పోయి 118/6 స్కోరుకు పడిపోయింది. ఈ వికెట్ల పతనం గురించి శ్రేయస్ మాట్లాడుతూ.. తాను ఔటైన తరువాత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి తన చేతికి తగిలిన గాయంపై ఐస్ పెట్టుకునే లోపల తమ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయిందన్నాడు. ఐపీఎల్‌లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయన్నాడు.ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ప్రశాంతంగా ఉండాలన్నాడు. కూపర్ అదే పని చేసి ఆఖరి వరకు క్రీజులో నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడని మెచ్చుకున్నాడు.
తమ జట్టు బౌలింగ్ గురించి మాట్లాడుతూ.. మూడో ఓవర్ తరువాత వికెట్ చాలా స్లో ఉందని అర్థమైందన్నాడు. అర్ష్‌దీప్ సింగ్ వచ్చి బంతి ఆగి వస్తుందని చెప్పాడు. దీంతో మేము వీలైనంత నెమ్మదిగా బంతులు వేయడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యామని చెప్పుకొచ్చాడు. విజయ్‌కుమార్ వైశాక్ గురించి మాట్లాడుతూ.. గత సీజన్ ఫామ్‌ను అతడు కొనసాగిస్తున్నాడని అన్నారు. తొలి మ్యాచ్‌లోనే అతడు రాణించడం సానుకూల అంశం అని చెప్పుకొచ్చాడు. ఈ టోర్నమెంట్‌లో అతడు ఇదే ఊపును కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఇకపై కూడా తాము ఇదే విధంగా ముందుకు సాగుతామన్నాడు.
