Shreyas Iyer : ఓట‌మికి గ‌ల ప్ర‌ధాన‌ కార‌ణాలు వెల్ల‌డించిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. ఆ ఒక్క త‌ప్పు వ‌ల్లే మేం ఓడిపోయాం..

స‌న్‌రైజ‌ర్స్ చేతిలో ఓట‌మిపై పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (Shreyas Iyer ) స్పందించాడు.

IPL 2026 Shreyas Iyer Key comments after pbks lost match to srh (pic credit@ipl)

  • స‌న్‌రైజ‌ర్స్ పై ఓట‌మి
  • తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేసిన పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌

Shreyas Iyer : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ హ్యాట్రిక్ ప‌రాజ‌యాల‌ను న‌మోదు చేసింది. బుధ‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 33 ప‌రుగుల తేడాతో ఓట‌మిని చ‌విచూసింది. ఈ ప‌రాజ‌యంపై పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు. ఫీల్డింగ్ వైఫ‌ల్యాలే త‌మ కొంప‌ముంచాయ‌ని అన్నాడు.

హెన్రిచ్ క్లాసెన్ (69; 43 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), ఇషాన్ కిష‌న్ (55; 32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలు చేయ‌గా.. అభిషేక్ శ‌ర్మ (35; 13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), ట్రావిస్ హెడ్ (38; 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) వేగంగా ఆడ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 235 ప‌రుగులు చేసింది. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్‌, ఫెర్గూస‌న్‌, చ‌హ‌ల్, విజ‌య్‌కుమార్ వైశాక్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

ఆ త‌రువాత 236 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో పంజాబ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 202 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో కూపర్ కొన్నోలీ (107 నాటౌట్; 59 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) అజేయ సెంచ‌రీ చేశాడు. మార్క‌స్ స్టోయినిస్ (28), సూర్యాంశ్ షెడ్జ్ (25) లు ప‌ర్వాలేద‌నిపించారు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో పాట్ క‌మిన్స్, శివంగ్ కుమార్ చెరో రెండు వికెట్లు తీశారు. నితీశ్ కుమార్ రెడ్డి, మ‌లింగ‌, సాకిబ్ హుస్సేన్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

ఆ క్యాచ్‌లు ప‌ట్టి ఉంటే..

మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మి పై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ స్పందించాడు. ఫీల్డింగ్ వైఫ‌ల్య‌మే త‌మ కొంప‌ముంచింద‌న్నాడు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు 30 నుంచి 40 ప‌రుగులు అద‌నంగా ఇచ్చామన్నాడు. ఏదీ ఏమైన‌ప్ప‌టికి కూడా ఈ మ్యాచ్‌లో తాము మూడు విభాగాలు.. బ్యాటింగ్, ఫీల్డింగ్‌, బౌలింగ్‌లో విఫ‌లం అయ్యామ‌ని అన్నాడు. మ్యాచ్ ఆరంభంలోనే కీల‌క క్యాచ్‌ల‌ను వ‌దిలివేయ‌డం విజ‌యావ‌కాశాల‌ను దెబ్బ‌తీసింద‌న్నాడు. వికెట్ స్లో అవుతూ ఆగుతూ వ‌స్తున్న త‌రుణంలో ప్ర‌త్య‌ర్థి స్కోరును నియంత్రించే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికి కూడా ఆ అవ‌కాశాన్ని చేజార్చుకున్న‌ట్లు చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్లు ప‌రిపూర్ణ‌మైన క్రికెట్ ఆడి మ్యాచ్ ఎలా గెల‌వాలో త‌మ‌కు చూపించార‌ని తెలిపాడు.

IPL 2026 Playoffs Schedule : ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుద‌ల చేసిన బీసీసీఐ.. బెంగ‌ళూరుకు షాక్‌.. ఫైన‌ల్ మ్యాచ్ ఎక్క‌డంటే?

ఇక సెంచ‌రీ చేసిన కూపర్ కొన్నోలీ పై శ్రేయ‌స్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. అత‌డు అద్భుత‌మైన ఆట‌గాడు అని కొనియాడాడు. అత‌డి ఆలోచ‌నా విధానం, ఒత్తిడిలో కూడా ప‌రుగులు చేసే అసాధార‌ణ నేర్పు అత‌డి సొంతం అని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో అత‌డు సాధించిన సెంచ‌రీనే ఇందుకు ఉద‌హ‌ర‌ణ అని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో త‌మ‌కు అతి పెద్ద సానుకూల అంశం ఇదేన‌ని అన్నాడు.

గ‌త మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవ‌డం పై స్పందిస్తూ.. ఈ టోర్నీలో త‌మ‌కు అద్భుత‌మైన ఆరంభం ల‌భించింద‌ని తాను భావిస్తున్నాన‌ని తెలిపాడు. అయితే.. ఆ త‌రువాత వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయామ‌న్నాడు. ఓడిన మ్యాచ్‌ల్లో ఎక్క‌డ త‌ప్పులు చేశామో విశ్లేషించుకుంటామ‌న్నాడు. పొర‌పాట్ల‌ను స‌రిదిద్దుకుని మ‌రింత బ‌లంగా తిరిగి వ‌స్తామ‌న్నాడు.

పంజాబ్ చెత్త ఫీల్డింగ్‌..

ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఫీల్డింగ్ చాలా పేల‌వంగా ఉంది. ఇషాన్ కిష‌న్ మూడు సార్లు 9, 18, 20 వ్య‌క్తిగ‌త స్కోర్ల వ‌ద్ద ఔట్ అయ్యే ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. క‌నోలీ, ఫెర్గూస‌న్‌లు ఇషాన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ల‌ను నేల‌పాలు చేశారు. ప్ర‌భ్‌సిమ్ర‌న్ సింగ్ స్టంపింగ్ అవ‌కాశాన్ని చేజార్చాడు. ఇక క్లాసెన్ 9 ప‌రుగుల వ‌ద్ద ఉన్న‌ప్పుడు చ‌హ‌ల్ బౌలింగ్ బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను శ‌శాంక్ సింగ్ వ‌దిలివేశాడు. ఈ అవ‌కాశాల‌ను స‌ద్వినియోం చేసుకున్న వీరిద్ద‌రు హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు.