Pat Cummins : సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు.. ఓటమికి కారణం నేనే..
కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడిపోవడంపై సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) స్పందించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 4, 2026 / 09:22 AM IST
IPL 2026 SRH vs KKR Pat Cummins Key Comments after Sunrisers Hyderabad lost match to Kolkata Knight Riders (pic credit@ipl)
- ఉప్పల్‌లో కేకేఆర్ చేతిలో ఓటమి
- స్పందించిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్
Pat Cummins : ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. బ్యాటింగ్ వైఫల్యంతో పాటు తాను ఓ ఓవర్‌లో 27 పరుగులు ఇవ్వడంతోనే మ్యాచ్‌లో గెలవలేకపోయామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (61; 28 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్ (42; 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీశాడు. సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. వైభవ్ ఆరోరా, కామెరూన్ గ్రీన్ ఒక్కొ వికెట్ సాధించారు.
అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. కేకేఆర్ బ్యాటర్లలో అంగ్ర్కిష్ రఘువంశీ (59; 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. అజింక్యా రహానే (43; 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) సాధించారు. రింకూ సింగ్ (22; 11 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో పాట్ కమిన్స్, శివంగ్ కుమార్, సాకిబ్ హుస్సేన్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
చిన్న చిన్న తప్పులే కానీ..
ఈ సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన తరువాత ఓటమి చవిచూడడంపై మ్యాచ్ అనంతరం పాట్ కమిన్స్ స్పందించాడు. ఈ రోజు తమకు కలిసి రాలేదన్నాడు. తాము గొప్ప ఆరంభాన్ని అందుకున్నామని, అయితే.. ఆ తరువాత దాన్ని కొనసాగించలేకపోయామన్నాడు. తమకు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే 180 నుంచి 200 కంటే ఎక్కువ పరుగులు చేయాల్సి ఉందన్నాడు. అయితే.. అలా జరగలేదన్నాడు.
ఈ పిచ్ పై 180 పరుగుల స్కోరు సాధిస్తే గెలవవచ్చునని తాను భావించానని అన్నాడు. ఇక సెకండాఫ్‌లో లభించిన కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయామన్నాడు. ఇందులో తన తప్పు కూడా ఉందన్నాడు. 180 పరుగులు చేసి ఉంటే ఫలితం మరో రకంగా ఉండేదన్నాడు. ఎందుకంటే పిచ్ కొంచెం నెమ్మదించిందన్నాడు. వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచిన తరువాత మ్యాచ్ ఓడిపోవడం పై మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో కూడా తాము స్వల్ప తేడాతోనే ఓడిపోయామన్నాడు. మ్యాచ్‌ను ఆఖరి దాకా తీసుకువచ్చామన్నాడు. అయితే.. తన బౌలింగ్‌లో ఓ ఓవర్‌లో 27 పరుగులు ఇవ్వడం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చునని చెప్పుకొచ్చాడు. ఇలాంటి చిన్న చిన్న క్షణాలే పెద్ద తేడాను తీసుకువస్తాయన్నాడు.
