Ishan Kishan : కెప్టెన్సీని తిరిగి కమిన్స్‌కు అప్పగించడంపై ఇషాన్ కిషన్ కీలక వ్యాఖ్యలు.. నా బ్యాటింగ్, వికెట్ కీపింగ్..
రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరం కావడంతో ఐపీఎల్ 2026 సీజన్‌లో తొలి అర్థభాగంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇషాన్ కిషన్ (Ishan Kishan ) నాయకత్వం వహించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- April 26, 2026 / 08:57 AM IST
IPL 2026 SRH vs RR Ishan Kishan comments On Pat Cummins Return As Captain (pic credit@ipl)
- తొలి అర్థభాగంలో సన్‌రైజర్స్‌కు నాయత్వం వహించిన ఇషాన్ కిషన్
- రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ రావడంతో పగ్గాలు వదిలివేసిన వికెట్ కీపర్
- మ్యాచ్ అనంతరం కీలక వ్యాఖ్యలు
Ishan Kishan : రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరం కావడంతో ఐపీఎల్ 2026 సీజన్‌లో తొలి అర్థభాగంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇషాన్ కిషన్ నాయకత్వం వహించాడు. ఇక శనివారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాట్ కమిన్స్ అందుబాటులోకి వచ్చాడు. తిరిగి సారథ్య బాధ్యతలను అందుకున్న కమిన్స్ తమ జట్టును గెలిపించుకున్నాడు. కెప్టెన్సీని కోల్పోవడం పై మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశాడు.
వైభవ్ సూర్యవంశీ (103; 37 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో మలింగ రెండు వికెట్లు తీశాడు. ప్రఫుల్ హింగే, పాట్ కమిన్స్, సాకిబ్ హుస్సేన్, నితీష్ కుమార్ రెడ్డి లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం ఇషాన్ కిషన్ (74; 31 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (57; 29 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) అర్థశతకాలతో రాణించడంతో 229 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేష్ శర్మ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. డోనోవన్ ఫెరీరా ఓ వికెట్ సాధించాడు.
ఇక పై నా దృష్టంతా వాటిపైనే..
సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈ అవార్డును అందుకున్న తరువాత అతడు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో తొలి అర్థభాగంలో కెప్టెన్సీ చేయడం గురించి మాట్లాడుతూ.. ఏడు మ్యాచ్‌ల పాటు జట్టుకు నాయకత్వం వహించడం చాలా సరదాగా అనిపించిందన్నాడు. పాట్ కమిన్స్ జట్టులోకి రావడం వల్ల తమకు అదనపు బౌలింగ్ పవర్ వచ్చిందన్నాడు. అతడు ఎలాగూ అద్భుతమైన కెప్టెన్ అని, అతడు జట్టులోకి వస్తున్నప్పుడు తాను చాలా సంతోషించినట్లు చెప్పుకొచ్చాడు. అందుకనే తాను ఇప్పుడు నాయకత్వం కంటే కూడా బ్యాటింగ్, వికెట్ కీపింగ్ పై మరింత దృష్టి పెడతానని అన్నాడు.
దూకుడుగా ఆడడం గురించి మాట్లాడుతూ.. విఫలం అవుతాం అని భయపడకుండా షాట్లు ఆడుతూనే ఉండాలన్నాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి తన హెల్మెల్‌కు తగిలి నేరుగా సిక్స్‌గా వెళ్లడం గురించి మాట్లాడుతూ.. ఆ బంతి తాను ఊహించిన దానికన్నా ఎక్కువగా బౌన్స్ అయిందని చెప్పాడు. ఆరు పరుగులు రావడం సంతోషం కలిగించిందన్నాడు. కొన్నిసార్లు, అదృష్టం ఎప్పుడూ ధైర్యవంతులనే వరిస్తుందని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు.
ఛేజింగ్ గురించి మాట్లాడుతూ.. మేం చాలా ప్రశాంతంగా ఉన్నామని నేను అనుకుంటున్నాను. 228 పరుగుల లాంటి భారీ స్కోరును ఛేజ్ చేస్తున్నప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పవర్ ప్లేలో భారీగా రన్స్ చేయాల్సి ఉంటుంది. ఇక ఓపెనర్లుగా హెడ్, అభిషేక్ ఉండటం వల్ల.. వాళ్ళు నాలుగు ఓవర్లు బ్యాటింగ్ చేసినా కూడా మిగతా బ్యాట్స్‌మెన్‌ల పని చాలా సులభం అవుతుంది. అందుకే నేను వాళ్ళతో కలిసి బ్యాటింగ్ చేస్తూ.. అభిషేక్‌తో మాట్లాడుకుంటూ ఉన్నాను. అతడికి మ్యాచ్ గురించి చాలా అవగాహన ఉంది, సాధించాల్సిన రన్‌రేటు గురించి చెబుతూ ఉంటాడు. అందుకే నేను నా షాట్లు ఆడుతూ ఉన్నాను. మేమిద్దరం మధ్యలో ఒక గొప్ప భాగస్వామ్యం నెలకొల్పామని నేను అనుకుంటున్నాను. అది మా జట్టుకు సహాయపడింది. అని ఇషాన్ కిషన్ తెలిపాడు.
ఇదే మీ అత్యుత్తమ ప్రదర్శన అని అడుగగా.. కాదని, తన అత్యుత్తమ ప్రదర్శన మున్ముందు రాబోతుందని ఇషాన్ కిషన్ చెప్పాడు.
