Tilak Varma : కోచ్‌కు చెప్పి మ‌రీ మ్యాచ్‌ను గెలిపించా.. తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ముంబై విజ‌యంలో కీల‌క పాత్ర పోషించ‌డంతో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ (Tilak Varma).

IPL 2026 Tilak Varma intresting comments after Mumbai Indians beat punjab kings

  • పంజాబ్ పై విజ‌యం
  • ముంబై గెలుపు కీల‌క పాత్ర పోషించిన తిల‌క్ వ‌ర్మ‌
  • ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు

Tilak Varma : ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్క‌మించిన ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు చాలా స్వేచ్ఛ‌గా ఆడుతోంది. గురువారం ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ముంబై గెలుపులో తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ కీల‌క పాత్ర పోషించాడు. 201 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో తిల‌క్ అద్భుతంగా ఆడాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స‌ర్ల సాయంతో 75 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ముంబై విజ‌యంలో కీల‌క పాత్ర పోషించ‌డంతో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అవార్డు అందుకున్న అనంత‌రం తిల‌క్ వ‌ర్మ మాట్లాడుతూ.. త‌న‌కు మ్యాచ్‌ల‌ను ముగించ‌డం అంటే ఇష్టం అని చెప్పుకొచ్చాడు.

ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, అంత‌ర్జాతీయ క్రికెట్‌లో టీమ్ఇండియా త‌రుపున ఆడ‌డం వ‌ల్ల మ్యాచ్‌ల‌ను ఎలా ముగించాలో అనే విష‌యం త‌న‌కు అర్థ‌మైంద‌న్నాడు. ఆ అనుభ‌వం, ఆత్మ‌విశ్వాసంతోనే ఆట‌ను మెరుగుప‌ర‌చుకుంటూ మ్యాచ్‌ల‌ను ముగిస్తున్నాన‌ని అన్నాడు. నిజం చెప్పాలంటే పిచ్ ఇలా ఉంటుంద‌ని తాము అస‌లు ఊహించ‌లేద‌న్నాడు. ఈ పిచ్ పై బంతి చాలా త‌క్కువ ఎత్తులో, స్లో గా వచ్చింద‌ని, బ్యాట‌ర్ల‌కు షాట్లు ఆడ‌డం చాలా క‌ష్ట‌మైంద‌న్నాడు.

Saim Ayub : పాక్ క్రికెట‌రా.. మ‌జాకానా.. 9 ఏళ్ల బాలుడి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌.. స్టార్ ఆట‌గాడి ఇజ్జ‌త్ మొత్తం పాయె

పంజాబ్ కింగ్స్ బ్యాట‌ర్లు కూడా 15 ఓవ‌ర్ల వ‌ర‌కు ఎలా ఇబ్బందులు ప‌డ్డారో అంద‌రం చూశామ‌న్నాడు. ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్, విష్ణు వినోద్ అద్భుతంగా ఆడి మంచి స్కోరును పంజాబ్‌కు అందించార‌ని చెప్పుకొచ్చాడు. ఇక త‌మ గేమ్ ప్లాన్ ఒక‌టేన‌ని అన్నాడు. మ్యాచ్‌ను ముగించ‌గ‌ల‌ను అనే న‌మ్మ‌కం ఉండ‌డంతో మ్యాచ్‌ను వీలైనంత చివ‌రి వ‌ర‌కు తీసుకువెళ్లాల‌ని అనుకున్న‌ట్లు చెప్పాడు.

కోచ్‌కు చెప్పి మ‌రీ..

రెండవ స్ట్రాట‌జీ టైమ్ ఔట్‌లో తాను కోచ్‌తో ఒక‌టే విష‌యం చెప్పాన‌ని అన్నాడు. ఒకే ఒక పెద్ద ఓవ‌ర్ అవ‌స‌రం అని, అప్పుడు తాను ఈజీగా మ్యాచ్‌ను ముగిస్తాన‌ని చెప్పిన‌ట్లుగా వివ‌రించాడు. అన్న‌ట్లుగానే ఇన్నింగ్స్ 18 ఓవ‌ర్‌లో 22 ప‌రుగులు రాబ‌ట్టాను. దురదృష్టవశాత్తు అది చ‌హ‌ల్ భ‌య్యా ఓవ‌ర్‌లో వ‌చ్చింద‌ని న‌వ్వుతూ చెప్పాడు. ఇక విల్ జాక్స్ ఆడిన ఇన్నింగ్స్ పై ప్ర‌శంస‌లు కురిపించాడు. గుడ్డిగా బంతిని బాదాల్సిన అవ‌స‌రం లేద‌ని, స్లో బంతుల కోసం వేచి చూడ‌మ‌ని అత‌డికి తాను చెప్పాన‌ని తెలిపాడు. ఏదీ ఏమైన‌ప్ప‌టికి కూడా తాను మ్యాచ్‌ను ముగించినందుకు సంతోషంగా ఉన్నాన‌ని అన్నాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట‌ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 200 ప‌రుగులు చేసింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (57; 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కం బాదాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (38; 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) వేగంగా ఆడాడు. ముంబై బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్ నాలుగు, దీప‌క్ చాహ‌ర్ రెండు వికెట్లు తీశాడు. కార్బిన్ బోష్, రాజ్ బవా చెరో వికెట్ సాధించారు.

Shreyas Iyer : ఓట‌మిని జీర్ణించుకోవ‌డం క‌ష్టంగా ఉంది.. మా కొంప‌ముంచింది ఆ ఒక్క‌డే.. ఏం చేస్తాం.. శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

తిల‌క్ వ‌ర్మ (75 నాటౌట్; 33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) అజేయ హాఫ్ సెంచ‌రీతో రాణించ‌డంతో ముంబై 201 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 19.5 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ర్యాన్ రికెల్టన్ (48; 23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), విల్ జాక్స్ (25 నాటౌట్ ;10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌లు ఆడారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు, మార్కో జాన్సెన్, చ‌హ‌ల్‌లు చెరో వికెట్ సాధించారు.