Alireza Beiranvand : గొర్రెల కాపరి నుంచి ప్రపంచకప్ హీరోగా.. ఇరాన్ గోల్ కీప‌ర్ అలిరెజా అద్భుత గాథ

ప్ర‌స్తుతం క్రీడా ప్ర‌పంచంలో ఇరాన్ గోల్ కీప‌ర్ అలీరెజా (Alireza Beiranvand ) పేరే వినిపిస్తోంది.

Iran Goalkeeper Alireza Beiranvand unreal story

Alireza Beiranvand : ప్ర‌స్తుతం క్రీడా ప్ర‌పంచంలో ఇరాన్ గోల్ కీప‌ర్ అలీరెజా పేరే వినిపిస్తోంది. ఇందుకు కార‌ణం.. ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026లో బెల్జియంతో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌నే. బెల్జియం జ‌ట్టు 23 సార్లు ఇరాన్ గోల్ పోస్టుపై దాడులు చేసింది. అలీరెజా అడ్డుగోడలా నిల‌బ‌డ్డాడు. ఏడు సార్లు గోల్స్ ఖాయ‌మ‌నుకున్న ద‌శ‌లో వాటిని విజ‌య‌వంతంగా ఆపేశాడు. దీంతో ఇరాన్ పై అల‌వోక‌గా గెలుస్తుంద‌నుకున్న బెల్జియం డ్రాతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.

అలీరెజా బెయిరాన్‌వాండ్ జీవితం ఎంద‌రికో స్ఫూర్తిదాయ‌కం. పేదరికం, నిరాశ్రయ జీవితం, కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రపంచకప్ వేదికపై హీరోగా నిలిచాడు. లోరెస్థాన్ ప్రావిన్స్‌లో ఓ సంచార గొర్రెల కాపరుల కుటుంబంలో జ‌న్మించాడు అలీరెజా. అత‌డికి చిన్న‌ప్ప‌టి నుంచి ఫుట్‌బాల్‌పై ఎంతో ఆస‌క్తి ఉండేది. కానీ ఇంటి ప‌రిస్థితుల దృష్ట్యా తండ్రీతో క‌లిసి గొర్రెల‌ను మేపేపాడు.

RR-MI : ముంబై, రాజ‌స్థాన్‌ల మ‌ధ్య ట్రేడ్ డీల్ చర్చ‌లు.. హార్దిక్‌ను ఇచ్చి ఆర్ఆర్ స్టార్ ఓపెన‌ర్ కోసం ఎంఐ తీవ్ర ప్ర‌య‌త్నాలు!

అత‌డి తండ్రికి మాత్రం ఫుట్‌బాల్ అంటే ఇష్టం ఉండేది కాదు. ఆ ఆట పేరు ఎత్తితేనే అలీరెజాను మంద‌లించి కొట్టేశాడు. ఈ క్ర‌మంలో త‌న క‌ల‌ను నెర‌వేర్చుకోవ‌డానికి అలీరెజా ఓ బంధువు వ‌ద్ద కొంత న‌గ‌దు తీసుకుని ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. టెహ్రాన్ వెళ్లాడు. అక్క‌డ ఓ స్థానిక క్ల‌బ్‌లో చేరాడు.

కాగా.. టెహ్రాన్‌లో అత‌డి జీవితం ఎంతో కష్టంగా సాగింది. ఉండటానికి ఇల్లు లేక రోడ్లపై, మసీదుల్లో నిద్రించాడు. జీవనోపాధి కోసం కార్లు కడగడం, దుస్తుల కర్మాగారంలో పని చేయడం, పిజ్జా షాప్‌లో ఉద్యోగం చేయడం వంటి ఎన్నో చిన్న పనులు చేశాడు. ఒకసారి ఫుట్‌బాల్ క్లబ్ కార్యాలయం బయట నిద్రిస్తే, ప్రజలు అతన్ని భిక్షగాడని భావించి నాణేలు వేసిన ఘటనలు కూడా ఉన్నాయి.

ఫుట్‌బాల్‌లో అత‌డి ప్ర‌తిభ చూసి స్థానిక క్ల‌బ్ నాఫ్తా అత‌డిని అండ‌ర్‌-23 జ‌ట్టులోకి తీసుకుంది. అక్క‌డ స‌త్తా చాటి అత‌డు ఇరాన్ అండ‌ర్‌-23 జ‌ట్టుకు ఆడాడు. అక్కడ కూడా నిరూపించుకుని 2015లో ఇరాన్ జాతీయ జ‌ట్టులో అరంగ్రేటం చేశాడు. 2018 ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కొట్టిన పెనాల్టీ షాట్‌ను అడ్డుకోవడం ద్వారా అలీరెజా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఫిఫా 2022లో త‌న కీపింగ్ నైపుణ్యాల‌తో ఆక‌ట్టుకున్న అత‌డు తాజా వ‌ర‌ల్డ్ క‌ప్‌లోనూ స‌త్తా చాటుతున్నాడు.

గోల్‌కీపర్‌గా అత్యంత దూరం బంతిని విసిరిన రికార్డుతో పాటు మరికొన్ని రికార్డులు కూడా అలీరెజా పేరిట ఉన్నాయి.