సిరాజ్ బౌలింగ్ కు సచిన్ ఫిదా
- madhu
- Updated on- January 18, 2021 / 06:15 PM IST
Mohd. Siraj’s ability : టీమిండియా బౌలర్ సిరాజ్ స్వింగ్ బౌలింగ్‌కు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఫిదా అయ్యాడు. పిచ్ సంబంధం లేకుండా బంతిని రెండు వైపులా నాట్యం చేయిస్తున్నాడంటూ ఈ హైదరాబాదీ పేసర్‌ను సచిన్ ప్రశంసించాడు. అంతేకాదు, సిరాజ్ ప్రతిభను అందరికీ వివరించేందుకు ఈ లెజెండరీ బ్యాట్స్‌మెన్ ఏకంగా ఓ వీడియోనే రూపొందించాడు. అందులో సిరాజ్ బంతిని పట్టుకునే తీరు, అవుట్ స్వింగర్ వేసేటప్పుడు సీమ్‌ను రిలీజ్ చేసే తీరు, ఇన్ స్వింగర్ వేసేటప్పుడు బంతిని ఎలా గింగిరాలు తిప్పుతాడో వివరంగా తెలిపాడు.
బ్రిస్బేన్ టెస్టు తొలిరోజున ఆసీస్ బ్యాట్స్ మెన్ సిరాజ్ స్వింగ్‌కు ఎలా ఇబ్బంది పడ్డారో సచిన్ వివరించాడు. బ్రిస్బేన్ లో సిరాజ్ విసిరిన బంతులు అవుట్ స్వింగర్లు, ఇన్ కట్టర్లుగా దూసుకెళ్లాయంటే అది పిచ్ పై ఉన్న పగుళ్ల వల్ల కానేకాదని ఈ మాస్టర్ బ్లాస్టర్ స్పష్టం చేశాడు. అది సిరాజ్ ప్రతిభ వల్లేనని ఉద్ఘాటించాడు.
ఆసిస్ పర్యటనలో తన మ్యాజికల్ బౌలింగ్‌తో అందరి నోళ్లు మూయించాడు. సీనియర్ బౌలర్లంతా గాయపడి టీమ్‌కు దూరమైన వేళ.. ఆ భారాన్ని తన భుజాలపై మోసిన సిరాజ్.. టెస్ట్ కెరీర్లో తొలిసారి ఐదు వికెట్లతో సత్తా చాటాడు. గబ్బా టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఆసిస్ వెన్నువిరిచాడు.
