Mitchell Santner : నిజం చెప్పొద్దు.. మేమెందుకు ఓడిపోయామంటే.. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ కామెంట్స్..
భారత్ చేతిలో మూడో టీ20 మ్యాచ్‌లో ఓడిపోవడంపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) స్పందించాడు.
Mitchell Santner Comments after New Zealand lost match to Team India in 3rd T20I
Mitchell Santner : వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ చేతిలో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే చేజార్చుకుంది. ఈ ఓటమిపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ స్పందించాడు. మ్యాచ్‌లో పవర్ ప్లే కీలకం అని, పవర్ ప్లేలో ఎలా బ్యాటింగ్ చేయాలో ప్రత్యర్థి బ్యాటర్లను చూసి నేర్చుకోవాలన్నాడు. ఓటమి నిరాశ కలిగించిందన్నాడు. ఏదీ ఏమైనప్పటికి కూడా భారత బ్యాటర్లను అడ్డుకోవడానికి ఓ ప్రణాళికను కనుగొనాల్సిన అవసరం ఉందన్నాడు.
డారిల్ మిచెల్ (89 నాటౌట్; 52 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా ఫిన్ అలెన్ (40; 25 బంతుల్లో 5 సిక్సర్లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం అభిషేక్ శర్మ (113; 38 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్ల) విధ్వంసకర శతకంతో పాటు వైభవ్ సూర్యవంశీ (45; 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో 199 పరుగుల లక్ష్యాన్ని భారత్ 13.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. మాథ్యూ ఫిషర్, మిచెల్ సాంట్నర్ చెరో వికెట్ తీశారు.
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమి గురించి న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు ఫామ్‌లో ఉన్నప్పుడు వారిని అడ్డుకోవడం చాలా కష్టన్నాడు. ఐపీఎల్లో కూడా ఇలాంటి పరిస్థితులను తాము చూశామని, ఇప్పుడు న్యూజిలాండ్‌లో కూడా అదే జరిగిందన్నాడు.
Abhishek Sharma : అభిషేక్ శర్మ కీలక వ్యాఖ్యలు.. నా ప్రణాళిక అదే.. వైభవ్ జట్టులో ఉన్నప్పుడు..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయినప్పటికి కూడా డారిల్, బీజే భాగస్వామ్యంతో తాము నిలబడ్డామన్నాడు. ఆ సమయంలో 200 పరుగుల దిశగా వెళ్లామన్నాడు. ఇలాంటి పిచ్‌పై 200 పరుగులు మంచి స్కోరేనని చెప్పుకొచ్చాడు. ఆఖరి ఓవర్లలో భారత బౌలర్లు చాలా చక్కగా బంతులు వేశారన్నాడు. ఖచ్చితమైన యార్కర్లు వేయడంతో పరుగులు చేయడం కష్టమైందన్నాడు. మొత్తంగా తమ జట్టు సాధించిన పరుగులపై తాను సంతృప్తినే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.
ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం అన్న సంగతి తమకు తెలుసున్నాడు. మంచు ప్రభావం మొదలైనప్పుడు బౌలింగ్ చేయడం, పరుగులను నియంత్రించడం చాలా కష్టమవుతుందన్నాడు. ఈ ఫార్మాట్లో పవర్ ప్లే కీలకమన్నాడు. పవర్ ప్లేలో ఎలా ఆడాలో భారత ప్లేయర్లు చూపించారన్నాడు.
మా ఆటగాళ్లు ఫామ్‌లోనే ఉన్నారు..
మా ఆటగాళ్లు క్రీజులో నిలదొక్కుకోవడమే కాకుండా, పెద్ద స్కోర్లు సాధిస్తున్నారు. ఇటీవల గ్లెన్ ఫిలిప్స్ 80లలో పరుగులు చేయగా, ఈరోజు డారిల్ మిచెల్ కూడా అద్భుతంగా ఆడాడు. మా బ్యాటింగ్ విభాగం మంచి ఫామ్‌లో ఉంది. వేర్వేరు ఆటగాళ్లు బాధ్యత తీసుకుని పరుగులు సాధించడం సంతోషంగా ఉంది. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రత్యర్థి జట్టుపై పరుగులు ఎలా సాధించాలో మాకు తెలుసు. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్ బౌలింగ్‌ను గమనించాను. పిచ్ నుంచి స్పిన్నర్లకు పెద్దగా సహకారం లభించలేదు. అయితే.. పేసర్లకు కొంతమేర స్వింగ్ లభించింది. కానీ భారత బ్యాటర్లు ఒకసారి దూకుడుగా ఆడటం మొదలుపెడితే.. వారిని ఆపడం కష్టమే.
ఇన్నింగ్స్ ప్రారంభంలో ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండటంతో మేము మైకేల్ బ్రేస్‌వెల్‌తో బౌలింగ్ చేయించాం. ఆ ఓవర్లో భారత బ్యాటర్లు స్పిన్‌ను చక్కగా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత బౌలింగ్‌లో మార్పులు చేస్తూ వారిని ఎలా నియంత్రించాలో ప్రయత్నించాం. ఏది ఏమైనప్పటికీ.. భారత బ్యాటర్లను అడ్డుకునేందుకు మరిన్ని మార్గాలను అన్వేషించాల్సి ఉంది. గతంలోనూ ఇలాంటి పరిస్థితులను చేశాము. ఇప్పుడు మేము ఈడెన్ పార్క్‌లో ఆడబోతున్నాం. అక్కడ మైదానం అన్ని వైపులా కొంత చిన్నదిగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి.. భారత బ్యాటర్ల దూకుడును అడ్డుకునేందుకు కొత్త వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంది అని మిచెల్ సాంట్నర్ తెలిపాడు.
