Mitchell Santner : నిజం చెప్పొద్దు.. మేమెందుకు ఓడిపోయామంటే.. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ వ్యాఖ్యలు..
Mitchell Santner : భారత్‌తో ఐదో వన్డేలో ఓటమిపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ స్పందించాడు.
Mitchell Santner Comments after New Zealand lost match to Team India in 5th ODI
Mitchell Santner : ఐదో వన్డేలో భారత్ చేతిలో న్యూజిలాండ్ 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-3 తేడాతో కోల్పోయింది. ఈ ఓటమిపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తీవ్ర నిరాశను వ్యక్తం చేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో అక్షర్ పటేల్ (46; 55 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), ఇషాన్ కిషన్ (46; 58 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్, జాకబ్ డఫీ చెరో మూడు. మాథ్యూ ఫిషర్ రెండు, బ్లెయిర్ టిక్నర్, మైఖేల్ బ్రేస్‌వెల్ చెరో ఓ వికెట్ తీశారు.
ఆ తరువాత 210 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 187 పరుగులకు కుప్పకూలింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (31; 42 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు, సిరాజ్, అక్షర్ పటేల్ చెరో రెండు, అకిబ్ నబీ, యశ్ ఠాకూర్, నమర్ ధీర్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అదే జరిగితే మ్యాచ్ గెలిచే వాళ్లం..
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ స్పందించాడు. తొలి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి మేము చాలా సంతృప్తిగా ఉన్నాము. మా బౌలర్లు పరిస్థితులకు తగ్గట్టుగా బాగా సర్దుబాటు చేసుకున్నారు. పిచ్ కొంచెం నెమ్మదిగా ఉంది. మధ్య ఓవర్లలో మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. మేము క్రమం తప్పకుండా వికెట్లు తీయగలిగాము. ప్రత్యర్థి స్కోరు 209 పరుగులకే పరిమితం చేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము.
ఇక ఈ రోజు ప్రత్యర్థి బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. నలుగురు పేసర్లు కూడా చాలా బౌలింగ్ చేశారు. శ్రేయాస్ వారిని సమర్థవంతంగా మార్చి మార్చి బౌలింగ్ చేయించాడు. మధ్య ఓవర్లలో కూడా వారు వరుసగా వికెట్లు తీసుకున్నారు. మేము ప్రతి భాగస్వామ్యాన్ని మరికొంతసేపు కొనసాగించి ఉంటే ఈ మ్యాచ్ గెలిచేవాళ్లం. కొన్ని దశల్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైంది. అర్ష్‌దీప్‌ను సరైన సమయంలో తిరిగి బౌలింగ్‌కు తీసుకురావడంతో పాటు సిరాజ్‌ను కూడా చక్కగా ఉపయోగించారు. పిచ్‌పై బంతి ఒకే విధంగా రాలేదు. కొన్ని బంతులు నెమ్మదిగా వస్తే, మరికొన్ని బౌన్స్‌తో వచ్చాయి. భారత బౌలర్లు ఫీల్డింగ్‌ను చాలా తెలివిగా సెట్ చేసి మాపై ఒత్తిడి పెంచారు. బౌన్స్‌ను కూడా అద్భుతంగా ఉపయోగించుకున్నారు. మొత్తంగా ఇది అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన.
సిరీస్ ఫలితాన్ని 3-1గా చూస్తే.. వాస్తవానికి ఇరు జట్ల మధ్య పోటీ అంత తేడాగా లేదని నా అభిప్రాయం. మేము కూడా కొన్ని మంచి ప్రదర్శనలు చేశాం. మధ్యలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. కొన్ని టాస్‌లు కూడా మాకు అనుకూలంగా పడలేదు. అయినప్పటికీ.. ఈ సిరీస్‌లో మేము చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం. ఈ రోజు మ్యాచ్‌లోనూ.. చివరి మ్యాచ్‌లోనూ బ్యాటింగ్‌లో మరికొంతసేపు నిలబడి ఆడగలిగితే ఫలితం మరోలా ఉండేది. ముఖ్యంగా 50 ఓవర్ల క్రికెట్లో బ్యాట్స్‌మెన్‌కు ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లడానికి చాలా సమయం ఉంటుంది. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు రావడం కూడా మంచి అనుభవం. కొంతమంది ఆటగాళ్లు తమ బాధ్యతను చక్కగా నిర్వర్తించి జట్టు కోసం రాణించడం సంతోషంగా ఉంది. అని మిచెల్ సాంట్నర్ అన్నాడు.
