KTR Comments : రాహుల్ వెంట పరుగులేంటి.. తెలంగాణ ఆత్మగౌరవం ఏమైంది? కాంగ్రెస్, బీజేపీపై కేటీఆర్ ఫైర్!
KTR Comments : హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ నేతలు పరుగులు తీయడంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డి, బీజేపీ నేతల తీరును ప్రశ్నిస్తూ తెలంగాణ ఆత్మగౌరవం అంశాన్ని తెరపైకి తెచ్చారు.
KTR Comments
- రాహుల్ కోసం మంత్రుల పరుగులు.. కేటీఆర్ సెటైర్లు
- పదవుల్లో ఉన్నది ప్రజల కోసమా? ఢిల్లీ నేతల సేవకా?
- రాహుల్ బైక్ ర్యాలీ.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త రచ్చ
KTR Comments : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆత్మగౌరవం అంశం హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్, బీజేపీ నేతల వ్యవహారశైలిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న దృశ్యాలపై ఆయన చేసిన సెటైర్లు ఆసక్తికరంగా మారాయి..
కాంగ్రెస్ నేతలపై మండిపాటు :
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గిగ్ వర్కర్ల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ స్కూటీపై ముందుకు వెళ్తుండగా.. ఆయన వెనుక టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలపై ఇప్పటికే నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Read Also : Vizianagaram Politics : వైసీపీని వీడుతున్న కీలక నేతలు.. జడ్పీపీఠంపై చిన్న శ్రీను పంతం నెగ్గించుకుంటారా.?
ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి గాంధీ కుటుంబానికి బాడీగార్డులా మారిపోయారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ బైక్ వెంట మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు పరుగులు తీయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.
బీజేపీ నేతలపై కేటీఆర్ ఫైర్ :
కేవలం కాంగ్రెస్‌నే కాదు.. బీజేపీ నాయకులనూ కేటీఆర్ వదల్లేదు. గతంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అమిత్ షా చెప్పులు మోశారంటూ విమర్శించారు. తెలంగాణకు చెందిన నాయకులు జాతీయ నాయకుల ముందు ఇలా వ్యవహరించడం రాష్ట్ర ఆత్మగౌరవానికి తగదని వ్యాఖ్యానించారు.
ప్రజలు ఇచ్చిన పదవులకు ఒక గౌరవం, హుందాతనం ఉంటాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులపైనే ఉంటుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నేతల తీరు సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే ఆత్మగౌరవ పునాదులపై జరిగిందని గుర్తుచేస్తూ.. ఆ విలువలను జాతీయ పార్టీలు అర్థం చేసుకోవడం లేదని విమర్శించారు.
