IND vs PAK : అదరగొట్టిన సుభాష్..! పాక్‌పై అద్భుత విజయంలో తెలుగు కుర్రాడి కీలక పాత్ర.. బంతితో.. బ్యాటుతో.. ప్రధాని మోదీ ప్రశంస
Chigurupati Venkata Naga Vijaya Subhash : అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టుపై భారత యువ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంలో తెలుగు కుర్రాడు చిగురుపాటి వెంకట నాగ విజయ సుభాష్ కీలక భూమిక పోషించాడు.
Chigurupati Venkata Naga Vijaya Subhash
Chigurupati Venkata Naga Vijaya Subhash : భారత యువ క్రికెటర్లు అద్భుతం చేశారు. చివరి వరకు నరాలుతెగే ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆఖరి బంతికి విజయాన్ని అందుకున్నారు. తద్వారా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టును ఓడించి అండర్-19 ఆసియా కప్ విజేతగా నిలిచారు. ఈ విజయంలో తెలుగు కుర్రాడు చిగురుపాటి వెంకట నాగ విజయ సుభాష్ కీలక భూమిక పోషించాడు. దీంతో అతని ఆటతీరుపై నెటిజన్ల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది.
Also Read : U-19 IND vs PAK : చివరి బంతి వరకు ఉత్కంఠ.. పాక్‌పై భారత్ సంచలనం.. తొమ్మిదోసారి ఆసియా కప్ కైవసం!
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. భారీ స్కోర్ చేధనలో భారత యువ జట్టు ప్రారంభం నుంచి దూకుడుగా ఆడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఓపెనర్లు లక్ష్య రాయ్‌చందాని (80), ఆర్యవీర్ (58) పరుగులతో రాణించారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన వారు భారీ పరుగులు సాధించడంలో విఫలయ్యారు. దీంతో 57 బంతుల్లో 86 పరుగులు చేయాల్సి వచ్చింది. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇక పాకిస్థాన్ జట్టుపై విజయం అసాధ్యమని అందరూ భావించారు. పాకిస్థాన్ ఆటగాళ్లలోసైతం గెలుపు ధీమా కనిపించింది. కానీ, చివరిలో మనల్ (47)కు తోడు మోహిత్ (49 నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో భారత శిబిరంలో మళ్లీ విజయంపై ఆశలు రేపారు.
మనల్ ఔటైన తరువాత ఇక మిగిలింది ఒక్కటే వికెట్. 16 బంతుల్లో 29 పరుగులు చేయాల్సి ఉంది. చివరి బ్యాటర్ తెలుగు కుర్రాడు చిగురుపాటి వెంకట నాగ విజయ సుభాష్. అతను 48వ ఓవర్లో మిగిలిన 4 బంతుల్లో 4 పరుగులే చేశాడు. అయితే 2 ఓవర్లలో 25 పరుగులు అవసరమైన స్థితిలో మోహిత్.. సయ్యమ్ బౌలింగ్‌లో తొలి రెండు బంతులకు 4, 6 బాదాడు. నాలుగో బంతికి సుభాష్ ఫోర్ కొట్టగా, 49వ ఓవర్లో మొత్తంగా 17 పరుగులొచ్చాయి. స్పిన్నర్ అహ్మద్ వేసిన చివరి ఓవర్లో 8 పరుగులు అవసరమైతే 5 బంతుల్లో 5 పరుగులే వచ్చాయి. చివరి బంతికి 3 అవసరం కాగా.. ముందుకు వచ్చిన మోహిత్ కవర్స్‌లో కళ్లు చెదిరే ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించి భారత్‌ను సంబరాల్లో ముంచెత్తాడు.
గుంటూరు కుర్రాడు సుభాష్..
పాకిస్థాన్ జట్టుపై అద్భుత విజయంలో తెలుగు కుర్రాడు చిగురుపాటి వెంకట నాగ విజయ సుభాష్ కీలక భూమిక పోషించాడు. 18 ఏళ్ల ఈ పేసర్ స్వస్థలం గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు గ్రామం. అతడి తండ్రి పూర్ణచంద్రరావు ఉద్యోగ రీత్యా చాలా ఏళ్ల క్రితం గోవాకు వెళ్లారు. వారు అక్కడే స్థిరపడ్డారు. సుభాష్ దేశవాళీల్లో గోవాకు ఆడుతూ భారత అండర్-19 జట్టులో చోటు సంపాదించాడు. ఫైనల్లో మ్యాచ్‌లో బౌలింగ్ సమయంలో మూడు వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ బ్యాటర్ల దూకుడుకు కళ్లెం వేశాడు. అనంతరం ఓటమి అంచుల్లో నిలిచిన జట్టును అతను ఆదుకున్నాడు. 309 పరుగుల వద్ద 9వ వికెట్ పడిన తరువాత చివరి బ్యాటర్‌గా వచ్చిన సుభాష్.. వికెట్ కాపాడుకుంటూనే మోహిత్‌తో విలువైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపించడంలో కీలక భూమిక పోషించాడు. ప్రతికూల పరిస్థితుల్లో అతను కొట్టిన రెండు బౌండరీలు విజయంలో కీలకమయ్యాయి. దీంతో సుభాష్ ఆటతీరు పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
What a Match 😲
पाकिस्तान की अंडर-19 टीम को भारत अंडर-19 ने रोमांचक मुकाबले में दी शर्मनाक हार बनी एशिया चैंपियन 🔥
Mohit Ulva का कमाल 🤩
#INDvsPAK
#AsiaCupU19Final
#INDu19vPAKu19 https://t.co/rBktLmMR13— Avinesh Kumar (@AvineshKumar_UP) November 14, 2026
ప్రధాని మోదీ ప్రశంస..
ఇదిలాఉంటే.. భారత యువ జట్టు సాధించిన చారిత్రక విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “భారత క్రికెట్‌కు ఇది ఎంతో గొప్ప రోజు. నేటి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి మెన్స్ అండర్-19 ఆసియా కప్ 2026 గెలిచిన మన యువ క్రికెటర్లను చూసి ఎంతో గర్వపడుతున్నాను. వీరి విజయం ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తుంది. భవిష్యత్తులో ఈ జట్టు మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ప్రధాని తన పోస్టులో పేర్కొన్నారు.
Outstanding day for Indian cricket!
Immensely proud of our young cricketers for today’s impressive performance and for winning the Men’s U-19 Asia Cup 2026. Their success will inspire several youngsters.
Best wishes to the team for their endeavours ahead.
— Narendra Modi (@narendramodi) November 14, 2026
