Virat Kohli : టెస్టుల్లో రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని కోహ్లీని కోరారా? బీసీసీఐ కార్యదర్శి ఏమన్నాడంటే..?
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli ) ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు.
- Thota Vamshi Kumar
- Published On : November 30, 2025 / 06:40 PM IST
Kohli asked to come out of Test retirement Devajit Saikia dismissed rumours
Virat Kohli : టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. టీ20లు, టెస్టులకు అతడు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవల భారత జట్టు టెస్టుల్లో ఘోర పరాజయాలను చవిచూస్తోంది. ఈ క్రమంలో టెస్టుల్లో రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని కోహ్లీ వెనక్కి తీసుకోవాలని బీసీసీఐ కోరినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవల దక్షిణాఫ్రికా చేతిలో టీమ్ఇండియా 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ అయిన సంగతి తెలిసిందే. దీంతో జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కోహ్లీ టెస్టులకు రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీసీసీఐ కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించాడు. అవన్నీ పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశాడు.
టెస్టు ఫార్మాట్ లో రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోవాలని విరాట్ కోహ్లీకి బీసీసీఐ ఎలాంటి అభ్యర్థన చేయలేదన్నాడు. అసలు ఈ విషయం అసలు బోర్డు మీటింగ్‌లో కూడా చర్చకు రాలేనద్నాడు. ఇలాంటి వాటిని నమ్మవద్దని చెప్పాడు.
సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా స్పందించాడు. కోహ్లీ, రోహిత్ శర్మ వంటి వారు తిరిగి జట్టులోకి రావాలని ఆసక్తి చూపిస్తే వారిని తిరిగి జట్టులోకి తీసుకురావాలని కోరాడు.
‘నేను సోషల్ మీడియాలో వచ్చే వార్తలను పెద్దగా నమ్మను. కానీ రోహిత్, కోహ్లీలు టెస్టు క్రికెట్‌ను మళ్లీ ఆడాలని అనుకుంటే వాళ్లని తిరిగి జట్టులోకి తీసుకోవాలి.’ అని కెవిన్ పీటర్సన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇదిలా ఉంటే.. రాంచి వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో తొలి వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ శతకంతో చెలరేగాడు. వన్డేల్లో తన 52వ శతకాన్ని అందుకున్నాడు. మరో సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మతో కలిసి 100+ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జట్టు భారీ స్కోరు చేసేందుకు సాయపడ్డాడు.
