Kuldeep Yadav : న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్.. భారీ రికార్డుపై కుల్దీప్ యాదవ్ కన్ను..
న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు కుల్దీప్ యాదవ్‌ను (Kuldeep Yadav) ఓ భారీ మైలురాయి ఊరిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published on- October 21, 2026 / 03:47 PM IST
Kuldeep Yadav need 2 more to complete 100 T20 Interrnational wickets
Kuldeep Yadav : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారం (అక్టోబర్ 22) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టీ20 మ్యాచ్‌కు క్రైస్ట్‌చర్చ్ వేదిక కానుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. అంతేకాదండోయ్ ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
భారత్ తరుపున ఇప్పటి వరకు కేవలం నలుగురు బౌలర్లు.. అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌లు మాత్రమే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100కు పైగా వికెట్లు తీశారు. అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన రికార్డు అర్ష్‌దీప్ సింగ్ పేరిట ఉంది. అతడు 64 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.
ఇక కుల్దీప్ యాదవ్ విషయానికి వస్తే.. 2017లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు అతడు 56 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 7.11 ఎకానమీతో 98 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సార్లు 5 వికెట్ల ఘనత సాధించగా, మూడు సార్లు నాలుగు వికెట్ల ఘనత నమోదు చేశాడు.
కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ విఫలం అయినా సరే.. సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో రెండు వికెట్లు తీసినా కూడా భారత్ తరుపున అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకు ఎక్కుతాడు.
