Rajasthan Royals : IPL సీజన్ మధ్యలో ఆసక్తికర పరిణామం.. చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్.. రూ.15,660 కోట్లకు దక్కించుకున్న అపర కుబేరుడు

Rajasthan Royals : రాజస్థాన్ రాయల్స్ జట్టు చేతులు మారింది. ప్రపంచ దిగ్గజ కుబేరుడు ఈ జట్టును కొనుగోలు చేశారు.

Lakshmi Mittal announces acquisition of Rajasthan Royals franchise Deal finalize at rs 15660 cr

  • చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్
  • ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ చేతుల్లోకి
  • రూ.15,660 కోట్లకు డీల్ 

Rajasthan Royals : రసవత్తరంగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో భారీ బిజినెస్ డీల్ క్రికెట్ వర్గాలతో పాటు వ్యాపార ప్రపంచాన్ని కూడా ఆకట్టుకుంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభ విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ యాజమాన్య హక్కుల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న స్టీల్ దిగ్గజం, భారత సంతతి బిలియనీర్ లక్ష్మీ మిట్టల్ కుటుంబం ఈ జట్టును కొనుగోలు చేసింది. ఇందుకు గాను సుమారు 1.65 బిలియన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీలో రూ. 15,660 కోట్లు) భారీ మొత్తం చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ఈ డీల్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

లక్ష్మీ మిట్టల్ కుటుంబంతో పాటు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదార్ పూనావాలా సంయుక్తంగా ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. ఈ ఒప్పందం గురించి మిట్టల్ ఫ్యామిలీ ఒక ప్రకటన విడుదల చేసింది. మనోజ్ బడాలే నేతృత్వంలోని కన్సార్టియం నుంచి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశామని మిట్టల్ కుటుంబం ఈ సందర్భంగా ప్రకటించింది.

అయితే గతంలో అమెరికాకు చెందిన కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇలా ఉండగానే తాజాగా నేడు మిట్టల్ కుటుంబం నుంచి వెలువడిన ప్రకటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 2008 ఐపీఎల్ తొలి ఎడిషన్ విజేత అయిన రాజస్థాన్ రాయల్స్, ప్రస్తుత సీజన్ లో అద్భుతంగా రాణిస్తోంది. మరీ ముఖ్యంగా యువ కెరటం వైభవ్ సూర్యవంశీ మెరుపులతో ఆర్ఆర్ జట్టు ప్లేఆఫ్స్ దిశగా దూసుకుపోతోంది.

యాజమాన్య వాటా వివరాలు..

కొత్త ఒప్పందం ప్రకారం, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు.. మిట్టల్ కుటుంబం నియంత్రణ అధికారాలతో కూడిన ప్రధాన యజమానిగా ఉండనుంది.

  • ఈ ఒప్పందంలో మిట్టల్ కుటుంబం: సుమారు 75 శాతం వాటా.

  • అదార్ పూనావాలా: 18 శాతం వాటా.

  • మిగిలిన 7 శాతం: మనోజ్ బదాలేతో సహా ప్రస్తుత పెట్టుబడిదారుల వద్ద ఉంటుంది.

రూ. 15,700 కోట్ల ఈ భారీ ఒప్పందంలో ఐపీఎల్‎లో రాజస్థాన్ రాయల్స్ మెన్స్ ఫ్రాంచైజీతో పాటు పార్ల్ రాయల్స్ (దక్షిణాఫ్రికా లీగ్), బార్బడోస్ రాయల్స్ (కరేబియన్ లీగ్) జట్లు కూడా భాగమేనని మిట్టల్ కుటుంబం ఈ సందర్భంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే కొన్నిరోజుల క్రితమే ఐపీఎల్లో అత్యంత క్రేజ్ ఉన్న ఆర్సీబీ జట్టు యాజమాన్యం కూడా చేతులు మారిన సంగతి తెలిసిందే. యూకేకు చెందిన డియాజియో గ్రూప్ నుంచి 1.78 బిలియన్ డాలర్లు (రూ. 16,660 – రూ. 16,700 కోట్లు)కు ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్‌స్టోన్ కన్సార్టియం కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జట్టుగా ఆర్సీబీ నిలవగా.. ప్రస్తుతం 1.65 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15,660 కోట్లు)కు అమ్ముడైన రాజస్థాన్, ఆర్సీబీ తర్వాత అత్యంత విలువైన జట్టుగా నిలిచింది.

రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు గురించి లక్ష్మీ మిట్టల్ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ ఆర్ టీమ్ ను కొనుగోలు చేయడానికి తన కుటుంబం నేపథ్యం కూడా ఒక కారణమని తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీ మిట్టల్ మాట్లాడుతూ.. మాది రాజస్థాన్‌ కుటుంబం. అందుకే రాజస్థాన్ రాయల్స్‌ను కొనుగోలు చేశా. పాఠశాలలో చదివే సమయంలో నేను కూడా క్రికెట్ ఆడేవాడిని. అప్పటి నుంచి నాకు క్రీడలంటే చాలా ఇష్టం. ఎందరో గొప్ప ఆటగాళ్లు రాజస్థాన్ జెర్సీని ధరించారు. యువతకు స్ఫూర్తిగా నిలిచిన మరెందరో భారత దిగ్గజాలు రాజస్థాన్ జట్టు తరఫున ఆడారు. అందుకే నేను ఈ గొప్ప జట్టులో భాగం కావాలనుకున్నాను. రాజస్థాన్‌ రాయల్స్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. స్టేడియంలో మ్యాచ్ చూస్తూ అభిమానులతో కలిసి రాజస్థాన్ టీమ్ గెలవాలని ఆకాంక్షించేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను అన్నారు లక్ష్మీ మిట్టల్.